Viral Video: ఇదేందయ్యా ఇది.. యాడా చూడలే.. రోడ్డు మధ్య కరెంట్ పోల్స్.. కామెంట్స్ మామూలుగా లేవుగా..

కొన్నిసార్లు అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరుతుంది. చెప్పిన పని చేశాం అన్నట్లుగా పైపైన పనులు చేపట్టి చేతులు దులుపుకుంటారు. గతంలో బీహార్‌లో చెట్ల మధ్య నుంచే రోడ్డు వేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ ఘటన మరవకముందే హిమాచల్ ప్రదేశ్‌లో మరో ఘటన అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.

Viral Video: ఇదేందయ్యా ఇది.. యాడా చూడలే.. రోడ్డు మధ్య కరెంట్ పోల్స్.. కామెంట్స్ మామూలుగా లేవుగా..
Himachal Road

Updated on: Jul 16, 2025 | 4:12 PM

సరైన రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం రోడ్డు మంజూరు చేసింది. అధికారులు పనులు చేపట్టారు. కొన్ని రోజులకు రోడ్డు పూర్తి అయ్యింది. అయితే నిర్మాణాన్ని చూసిన వారంతా షాకయ్యారు. ఇదేంటి రోడ్డు ఇలా కూడా వేస్తారా అని ముక్కున వేలేసుకున్నారు. ఎందుకంటే కరెంట్ పోల్స్ మధ్యలో రోడ్డు వేసినట్లుగా ఉంది అది. రోడ్డు మధ్యలో కరెంట్ పోల్స్ ఉంటే ఎలా వెళ్తారని స్థానికులు ప్రశ్నించినా స్పందించేవారే లేరు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో జరిగింది. సిర్మౌర్ జిల్లాలోని బద్రీపూర్, కిషన్‌పురా, సంతోఖ్‌గఢ్ పురువాలాల గ్రామాలను కలుపుతూ ఈ రోడ్డు వేశారు. రోడ్డు వేసేటప్పుడు కరెంట్ పోల్స్ తియ్యకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలుస్తుంది. ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దీన్ని వీడియో తీసి పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ‘‘వారెవ్వా.. ఏం తెలివి.. రోడ్డు సూపర్ వేశారు. మందు తాగిన వ్యక్తులు రోడ్డును చూడకపోయిన కరెంట్ పోల్స్‌ను చూస్తారు. నిజంగా అద్భుతం. ఈ రోడ్డు హిమాచల్ టూరిజాన్ని పెంచుతుంది’’ అంటూ సెటైర్లు వేశాడు.

ఈ అంశంపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సుఖ్‌రామ్ చౌదరి స్పందించారు. విద్యుత్ లైన్ కనీసం 25 ఏళ్ల పాతదని.. రోడ్డు విస్తరణ ప్రాజెక్టు ప్లాన్ చేసినప్పుడు.. అధికారులు విద్యుత్ లైన్‌ను కూల్చివేయాలని ఆలోచించలేదని తెలిపారు. ‘‘ అధికారులు పోల్స్ మధ్య నుంచే రోడ్డు వేసుకుంటూ వెళ్లారు. ఈ స్తంభాలను మార్చమని నేను సంబంధిత శాఖను అభ్యర్థించాను. అయితే దీన్ని తీయడానికి నిధులు లేవని అధికారులు చెప్పినట్లు’’ వివరించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంజినీర్ల అద్భుతం, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం, ఇండియన్ ఇంజినీర్లు అంటేనే ఇలా ఉంటారు, శిమ్లా తర్వాత ఈ రోడ్డు టూరిస్ట్ స్పాట్‌గా మారుతుంది అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో బీహార్‌లోనూ ఇటువంటి ఘటనే జరిగింది. పాట్నా నుండి 50 కి.మీ దూరంలో ఉన్న జెహానాబాద్‌లో జిల్లా యంత్రాంగం రూ. 100 కోట్ల రోడ్డు విస్తరణ ప్రాజెక్టును చేపట్టింది. చెట్లను తొలగించడానికి అటవీ శాఖను సంప్రదించగా.. వాళ్లు ఒప్పుకోలేదు. చెట్లను కొట్టేసే భూమికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో అధికారులు చెట్ల మధ్య నుంచే రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు హిమాచల్‌లోనూ అటువంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం.