
పంజాబ్‌లో మనీలాండరింగ్, రియల్ ఎస్టేట్ అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఉక్కుపాదం మోపుతోంది. మోహాలీ జిల్లా ఖరార్‌లోని వెస్ట్రన్ టవర్స్ సొసైటీలో ఈడీ అధికారులు జరిపిన దాడులు ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించాయి. ఈడీ అధికారులు ఒక ఐటీ వ్యాపారి నివాసంపై దాడి చేసిన సమయంలో, లోపల ఉన్న వ్యక్తులు ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా, తొమ్మిదో అంతస్తు నుండి సుమారు రూ. 21 లక్షల నగదు ఉన్న బ్యాగును కిందకు విసిరారు. కింద అప్పటికే కారుతో సిద్ధంగా ఉన్న ఒక డ్రైవర్ ఆ బ్యాగును అందుకుని వేగంగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, అప్రమత్తమైన ఈడీ అధికారులు అతనిని వెంబడించి పట్టుకున్నారు. ఆ బ్యాగులో రూ. 21 లక్షల కరెన్సీ నోట్లు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
ఈ దాడులు కేవలం ఒక్కరికే పరిమితం కాలేదు. మోహాలీ, చండీగఢ్‌లోని సుమారు 12 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సన్‌టెక్ సిటీ ప్రాజెక్ట్, ఏబీఎస్ టౌన్‌షిప్, ఆల్టస్ బిల్డర్స్, ధీర్ కన్స్ట్రక్షన్స్ వంటి పెద్ద సంస్థలు ఈడీ రాడార్‌లో ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, ప్రజల నుండి వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కుంభకోణంలో నితిన్ గోహల్ అనే వ్యక్తి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇతను బిల్డర్లకు, ప్రభుత్వ అధికారులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. నితిన్ గోహల్‌కు పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయంలోని కొందరు ప్రభావవంతమైన వ్యక్తులతో, ముఖ్యంగా సీఎం ఓఎస్డీ రాజ్‌బీర్ ఘుమ్మన్ సన్నిహితులతో సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
వీడియో ఇక్కడ చూడండి..
ਮੋਹਾਲੀ ਦੇ ਖਰੜ ਵਿੱਚ ਜੋ ਹੋਇਆ, ਉਸ ਨੇ ਪੰਜਾਬ ਦੀ ਸਿਆਸਤ ਵਿੱਚ ਭੂਚਾਲ ਲਿਆ ਦਿੱਤਾ ਹੈ। ਜਦੋਂ ED ਨੇ ਦਸਤਕ ਦਿੱਤੀ ਤਾਂ ਨੌਵੀਂ ਮੰਜ਼ਿਲ ਦੇ ਫਲੈਟ ਤੋਂ ਨੋਟਾਂ ਨਾਲ ਭਰੇ ਬੈਗ ਹੇਠਾਂ ਸੁੱਟੇ ਗਏ। ਸੂਤਰਾਂ ਮੁਤਾਬਕ ਤਾਰਾਂ ਮੁੱਖ ਮੰਤਰੀ ਦੇ ਕਰੀਬੀਆਂ ਨਾਲ ਜੁੜ ਰਹੀਆਂ ਹਨ। ਕੀ CM ਭਗਵੰਤ ਮਾਨ ਜਵਾਬ ਦੇਣਗੇ ਕਿ ਉਹਨਾਂ ਦੇ ਸੰਗੀ-ਸਾਥੀਆਂ ਦੇ ਘਰ… pic.twitter.com/b9znYeIWuo
— BJP PUNJAB (@BJP4Punjab) May 7, 2026
ప్రస్తుతం ఈడీ అధికారులు డిజిటల్ రికార్డులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఎక్కడి నుండి వచ్చింది? ఎవరికి చేరవేయడానికి ప్రయత్నించారు? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని పెద్ద తలకాయల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..