
ప్రపంచంలో అద్భుతమైన డిజైన్లు, సరికొత్త రికార్డులకు నిలయంగా ఉన్న దుబాయ్ మరో అరుదైన ఘనతను సాధించింది. దుబాయ్‌కు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ ప్రపంచంలోనే అత్యంత బరువైన, అతిపెద్దదైన బంగారు జుంకాను రూపొందించి చరిత్ర సృష్టించింది. అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ భారీ స్వర్ణ ఆభరణం రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అద్భుత కళాఖండానికి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మయూర్ సహస్ర అంటే ఒక వేయి నెమళ్లు అని పేరు పెట్టిన ఈ అద్భుతమైన జుంకాను పూర్తిగా 22 కేరట్ల బంగారంతో తయారు చేశారు. దీని మొత్తం బరువు దాదాపు 16.514 కిలోగ్రాములుగా ఉంది. అక్టోబర్ 24న దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లోని జ్వెల్ ఆఫ్ జాయ్ బై జాయ్‌లుక్కాస్ అనే మధ్యప్రాచ్యా అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్‌లో ఈ మహాద్భుత జుంకాను అధికారికంగా ప్రదర్శించారు. ఈ జుంకా పొడవు 1.215 మీటర్లు కాగా, దీని వ్యాసం 0.682 మీటర్లు ఉండటం విశేషం.
ఇంతటి భారీ, అరుదైన ఆభరాన్ని తయారు చేయడం సాధారణ విషయం కాదు. దీని వెనుక దాదాపు 55 మంది నిపుణులైన స్వర్ణకార కళాకారుల అంకితభావం ఉంది. ఈ జుంకా తయారీకి వారు ఏకధాటిగా శ్రమించి మొత్తం 5,840 గంటల పాటు పనిచేశారు. యూఏఈలోని ఓ ప్రముఖ సంస్థ తమ వ్యాపార ప్రయాణానికి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, దుబాయ్ నగర అభివృద్ధికి గుర్తింపుగా ఈ సరికొత్త రికార్డును బహుమతిగా ఇవ్వాలని భావించి ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది.
భారతీయ సంస్కృతిలో నెమలి అనేది అందం, గర్వం, శాంతికి ప్రతీకగా నిలుస్తుంది. పురాణాల ఆధారంగా వెయ్యి నెమలి ఈకల స్ఫూర్తితో ఈ డిజైన్‌ను రూపొందించారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక న్యాయనిర్ణేతలు పాల్గొని, సదరు వ్యాపార గ్రూప్ చైర్మన్, సీఈఓ లకు రికార్డు ధృవీకరణ పత్రాలను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆభరణ ప్రియులను, కళాభిమానులను ఈ అరుదైన బంగారు జుంకా ఎంతగానో ఆకట్టుకుంటోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..