
Dharamshala Tourist Chaos Video: హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ధర్మశాలలో ఒక విదేశీ పర్యాటకుడు మద్యం మత్తులో సృష్టించిన బీభత్సం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మార్కెట్ నడిబొడ్డున కూరగాయలు రోడ్డుపైకి విసిరేస్తూ, వాహనాలపై రాళ్లు రువ్వుతూ అతడు చేసిన రభసకు సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో దేశవ్యాప్తంగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధర్మశాలలోని అత్యంత రద్దీగా ఉండే కచేరి చౌక్, కొత్వాలి బజార్ ప్రాంతంలో ఈ చేదు సంఘటన చోటుచేసుకుంది. పూర్తిగా మద్యం మత్తులో మునిగిపోయిన ఒక విదేశీ పర్యాటకుడు నడిరోడ్డుపై స్థానికులను, వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. రోడ్డు పక్కన ఉన్న దుకాణాల నుంచి కూరగాయలను లాక్కొని రోడ్డుపైకి విసిరేస్తూ కేకలు వేశాడు. దీంతో భయాందోళనకు గురైన తోపుడుబండ్ల వ్యాపారులు, పక్కనే వెళ్తున్న బాటసారులు ప్రాణాలు చేతబట్టుకుని పరుగులు తీశారు.
అంతటితో ఆగకుండా, అక్కడ పార్క్ చేసి ఉన్న ఒక టాక్సీ వాహనంపైకి పెద్ద పెద్ద రాళ్లను విసిరాడు. ఈ దాడిలో సదరు వాహనం అద్దాలు ధ్వంసమవడమే కాకుండా, మార్కెట్‌లో ఉన్న ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఈ గందరగోళం జరుగుతున్న సమయంలో అక్కడే విధుల్లో ఉన్న ఒక మహిళా ట్రాఫిక్ పోలీస్ అధికారి సదరు పర్యాటకుడిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. అయితే, ఆ వ్యక్తి ఏమాత్రం తగ్గకుండా ఆమెపైనే తిరగబడి, అత్యంత దురుసుగా ప్రవర్తించాడు. స్థానిక దుకాణదారులు, కొందరు పౌరులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, పోలీసు వాహనం వచ్చేంతవరకు అతడు మార్కెట్ వీధుల్లో పగ బట్టినట్టుగా అరుస్తూనే ఉన్నాడు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ విదేశీ పర్యాటకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై అసిస్టెంట్ సూపర్‌ఇంటెండెంట్ ఆఫ్ పోలీస్ బీర్ బహదూర్ సింగ్ మాట్లాడుతూ, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, ధర్మశాలలో అతడి బసకు సంబంధించిన వీసా, ఇతర పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు.
If an Indian tourist had done this abroad, the outrage would be everywhere by now. This happened in Dharamshala, where a foreign tourist created a scene on the street and even misbehaved with a female police officer. He was later arrested by police ! pic.twitter.com/GF9sORyqCt
— Nikhil saini (@iNikhilsaini) June 4, 2026
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు విదేశీ పర్యాటకుల ప్రవర్తనపై పెద్ద ఎత్తున చర్చకు తెరలేపారు. ముఖ్యంగా అంతర్జాతీయ పర్యాటక రంగంలో కనిపిస్తున్న “ద్వంద్వ ప్రమాణాల”పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
“ఇదే పని మన భారతీయుడు ఎవరైనా విదేశాల్లో చేసి ఉంటే, ఈపాటికి అంతర్జాతీయ మీడియాలో దేశం పరువు తీసేవారు” అని ఒక వినియోగదారుడు కామెంట్ చేయగా, దానికి వేల సంఖ్యలో మద్దతు లభించింది. “మన దేశంలో కాబట్టి జనాలు ఓపికగా చూశారు, అదే వేరే చోట అయితే కథ వేరేలా ఉండేది” అంటూ మరికొందరు స్థానికుల సంయమనాన్ని అభినందించారు. బాధ్యతాయుతమైన పర్యాటకం అంటే ఇదేనా అంటూ విదేశీయుల తీరును సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు.
పర్యాటకం ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ఊతమిస్తుందనేది నిజమే అయినప్పటికీ, స్థానిక చట్టాలను, సంస్కృతిని గౌరవించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత. విదేశీయుడైనా, స్వదేశీయుడైనా తప్పు చేసినప్పుడు చట్టం ముందు సమానంగా నిలబెట్టాలని, ఇలాంటి పర్యాటకులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అడ్డుకోవచ్చని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..