Viral Video: ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రయాణం సాఫీగా సాగుతుందని అందరికీ తెలిసిందే. కానీ పాటించం.. త్వరగా గమ్యాన్ని చేరుకోవాలనే కోరిక ప్రమాదాలను కొని తెచ్చి పెడుతుంది. గమ్యాన్ని త్వరగా చేరుకోవాలంటే, ముందు బయలుదేరాలనే విషయాన్ని గుర్తించకుండా ఆదరబాదరాగా వెళుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. ముఖ్యంగా రాంగ్ రూట్‌లో ప్రయాణించడం ఎంతో డేంజర్ అని తెలిసినా అడ్డదారిలో వెళ్తుంటారు. అయితే దీనివల్ల కలిగే నష్టం మాత్రం తీవ్ర విషాధాన్నే మిగుల్చుతుంది.
తాజాగా వైరల్ అవుతోన్న ఓ వీడియో ఇదే విషయాన్ని చెబుతుంది. రాంగ్ రూట్‌లో త్వరగా వెళ్లాలనుకున్న ఓ బైకర్ అత్యుత్సాహం తీవ్ర ప్రమాదానికి దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని మైలర్ దేవ్ పల్లి, దుర్గానగర్‌లోని కూడలి వద్ద ఒక వ్యక్తి బైక్‌పై రాంగ్ రూట్‌లో వస్తున్నాడు. అదే సమయంలో అవతలి వైపు నుంచి కారు వేగంగా దూసుకొస్తోంది. ఎదురుగా ఎవరు వస్తారులే అనే నమ్మకంతో ఉన్న ఆ కారు డ్రైవర్‌కు ఊహించని సీన్ ఎదురైంది. ఎదురుగా వస్తున్న బైక్‌ను వేగంగా ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు.
సెంటీమీటర్ ప్రయాణం అయిన రాంగ్ రూట్లో వెళ్ళకండి.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/SsFkp84XXc
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) July 7, 2022
ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. తాజాగా ఈ వీడియోను పోస్ట్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్.. ‘సెంటిమీటర్ ప్రయాణం అయిన రాంగ్ రూట్లో వెళ్లకండి’ అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియోకాస్త వైరల్‌గా మారింది. అయితే సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడా లేదా అన్న విషయం మాత్రం తెలియలేదు. ఏది ఏమైనా ఒక్క రెండు నిమిషాలు ఆలస్యమైనా యూటర్న్ తీసుకొని వచ్చి ఉంటే ఆ ప్రమాదం జరిగిఉండేది కాదన్నది మాత్రం సత్యం.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..