ఈద్ పార్టీ చేసుకునేందుకు డబ్బులు లేకపోవడంతో ఇద్దరు వ్యక్తులు దోపిడీకి అదిరిపోయే ప్లాన్ రచించారు. అయితే ఎంత తెలివైన దొంగ అయినా కూడా తప్పు చేయడం సహజమే. వీరి విషయంలోనూ అదే జరిగింది. దోపిడీ చేసేందుకు ఆపిన వాహనం క్రైమ్ బ్రాంచ్ పోలీసులది కావడంతో.. చివరికి ఆ ఇద్దరు వ్యక్తులు జైలుపాలయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని పల్వాల్ జిల్లా చందత్ గ్రామానికి చెందిన కృష్ణ అలియాస్ రాహుల్, రాహుల్ అలియాస్ రాజా ఇద్దరూ మంచి స్నేహితులు. వీరు ఈద్‌కు పార్టీ చేసుకునేందుకు డబ్బులు లేకపోవడంతో దారి దోపిడీకి పక్కా స్కెచ్ వేశారు. ”లిఫ్ట్ కోసం వేచి చూసి.. ఓ వాహనాన్ని ఆపి.. అందులోకి ఎక్కగానే బెదిరించి డబ్బులు లాక్కోవాలని ప్లాన్ వేశారు.”
అనుకున్నట్లుగానే స్థానిక రహదారిపై కాపు కాశారు. దూరం నుంచి ఓ వాహనం వస్తున్నట్లుగా గమనించారు. దగ్గరకు రాగానే దాన్ని ఆపి.. లిఫ్ట్ కావాలంటూ అడిగారు. అయితే ఇక్కడే వారికి ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్ ఎదురైంది. ఆ వాహనంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఉన్నారు. వీరి కదలికలు అనుమానంగా కనిపించడంతో.. ఇద్దరిని పట్టుకుని అరెస్ట్ చేశారు. కాగా, పోలీసులు నిందితులిద్దరిపై దోపిడీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.