Cockroach coffee: కాక్రోచ్ కాఫీ.. తాగారంటే మైమరిచిపోతారు.. ఎక్కడికి అని అడగొద్దు..

ఏ ఛాయ్ చటుక్కున తాగరా భాయ్.. అనుకునే వారు సైతం గుమగుమల కాఫీ వాసన తగలగానే మనసు మార్చేసుకుంటారు. ఇక కాఫీ ప్రియులైతే రోజుకో డిఫరెంట్ టేస్ట్ ఆస్వాదించేవరుకూ నిద్రపోరు. ప్రపంచ వ్యాప్తంగా ఛాయ్ కంటే కాఫీ ప్రియులే ఎక్కువ అని లెక్కలు చెప్తున్నాయి. అది వేరే ముచ్చట కానీ ఇప్పుడు మేం చెప్పబోయే కాఫీని తాగాలంటే మాత్రం జేబులో డబ్బులే కాదు గుండెల్లో ధైర్యం దండిగా ఉండాల్సిందే. మరీ అంతలా డేర్ ఛాలెంజ్ చేసే కాఫీ కథ ఏంటి అనేగా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

Cockroach coffee: కాక్రోచ్ కాఫీ.. తాగారంటే మైమరిచిపోతారు.. ఎక్కడికి అని అడగొద్దు..
Cockroach Coffee

Edited By: Ram Naramaneni

Updated on: Nov 25, 2025 | 4:04 PM

కాక్రోచ్ కాఫీ.. అవును మీరు విన్నది నిజమే.. బొద్దింకల కాఫీనే. ఈ మాట వినగానే కడుపులో తిప్పినట్టు అయింది కదా.. ఇంకా అలాంటి కాఫీని తాగితే ఎలా ఉంటుందో‌ కదా. కానీ క్రిమి భోజనాలకు కేరాఫ్‌గా నిలిచే చైనాలో ఇప్పుడు ఈ కాఫీకి యమ క్రేజ్ ఉందంట. బొద్దింకలు, కీటకాల ఆవశేషాలతో కూడిన ఈ కాఫీని తాగేందుకు అక్కడి జనం ఎగబడుతున్నారంట కూడా. అలా అని ఇది తక్కుత ధరకే వచ్చేస్తుందని అనుకుంటున్నారేమో.. అస్సలు కాదు.. ఆ కాఫీ ఖరీదు అక్షరాల ఐదు వందల రూపాయలంట. ఈ చిత్ర విచిత్రమైన కాఫీని బీజింగ్‌లోని కీటకాల మ్యూజియం ప్రపంచానికి పరిచయం చేసింది.

ఈ మ్యూజియంలోని కేఫ్‌లో ఈ ‘కాక్రోచ్ కాఫీ’ తయారు అవుతోంది . ఈ కాఫీని బొద్దింకల పొడితో తయారు చేస్తారంట. ఈ కాఫీ ధర దాదాపు 500 రూపాయలు ఉంటుందంట. ఈ కాఫీ తయారు చేయడానికి, ముందుగా బొద్దింకలను ఎండబెడతారని… ఆ తరువాత వాటిని మెత్తని పొడిగా చేస్తారని.. ఆ పొడితో కాఫీ తయారు చేస్తారని అక్కడి మ్యూజియం కాఫీ నిర్వాహకులు చెప్తున్నారు. ఈ‌ కాఫీ తాగితే ప్రాణాలతో‌ ఉంటామా అంటే అలాంటి అనుమానాలు వద్దే వద్దు. ఈ కాఫీ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుందని అక్కడివారు గట్టిగా చెబుతున్నారు.

అసలు బొద్దింక పేరు వింటేనే ఒళ్లు జలదరించడం కామన్. ఇంట్లో, వంటింట్లో కనిపిస్తేనే వాటిని వెంటాడి వేటాడి చంపేవరకూ మనసుకు ప్రశాంతత ఉండదు. అలాంటి కీటకాలను పొడిగా చేసి కాఫీగా తయారు చేసి అందివ్వడం చైనా వాళ్లకే సాధ్యం అంటున్నారు నెటిజన్‌లు. డబ్బులు పెట్టి మరీ కొత్త కొత్త రోగాలను కొనుక్కోవాలంటే ఓ చెత్త సాహసాలు చేయక తప్పదంటూ విమర్శిస్తున్నారు. అయితే కొత్తొక వింత.. పాతొక రోత అన్న సామెతను తూచ తప్పకుండా పాటించే చైనా వాళ్లు ఈ కాక్రోచ్ కాఫీని లొట్టలేసుకుంటూ తాగుతున్నారంట. మీరు తాగాలనికుంటే బీజింగ్ వెళ్లి ఓ సాహసం చేయండి మరీ.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.