ఓ బ్రెజిలియన్ డాక్టర్ షేర్ చేసిన ఎక్స్‌రే ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ ఎక్స్‌రే సిస్టిసెర్కోసిస్(Cysticercosis) అనే వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిది. ఆ వ్యాధి వల్ల సదరు వ్యక్తి ఒంటి నిండా టేప్‌వార్మ్ గుడ్లు నిండి ఉన్నాయి. గత నెలలో సో పాల్ అనే వ్యక్తి తీవ్రమైన దగ్గుతో బొటుకాటు నగరంలోని ఓ అస్పత్రికొచ్చాడు. అక్కడున్న బోరిన్ డిసౌజా అనే డాక్టర్ అతడిపై పలు టెస్టులు నిర్వహించారు. అనంతరం వచ్చిన రిపోర్ట్స్ చూడగా డాక్టర్ మైండ్ బ్లాంక్ అయింది. అతడి ఎక్స్‌రేలో ఒంటి నిండా టేప్‌వార్మ్ గుడ్లు నిండి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఇన్ఫెక్షన్ పేగు పరాన్నజీవి కారణంగా సోకుతుందన్నారు. అయితే అదృష్టవశాత్తు ఆ టేప్‌వార్మ్ గుడ్లు కారణంగా రోగికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ప్రస్తుతం అతడికి సంబంధించిన ఎక్స్‌రే మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.
అవి మనిషికి ఎలాంటి అసౌకర్యం కలిగించనంతవరకు.. వీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని డాక్టర్ డిసౌజా వివరించారు. ఇలాంటి కేసులు బ్రెజిల్‌లో అరుదుగా నమోదవుతాయన్నారు. సిస్టిసెర్కోసిస్ అనేది టేప్‌వార్మ్ గుడ్లు తీసుకోవడం ద్వారా కలిగే వ్యాధి అని, ఇవి మనిషి శరీరంలోకి పందులు, బోవిన్(ఎద్దు జాతికి చెందినది) లాంటి టేప్ వార్మ్ ఇంటర్మీడియట్ హోస్టుల ద్వారా చేరుతాయని అన్నారు. పరిశుభ్రత నియమాలు తరచుగా విస్మరించే దేశాల్లో ఈ సిస్టిసెర్కోసిస్ అనే వ్యాధి ఎక్కువగా ప్రబలుతుందని డాక్టర్ చెప్పారు. సిస్టిసెర్సీ మనిషి శరీరంలోని ఏ అవయవానికైనా సోకుతుందని.. దీని ప్రభావం మెదడుపై తీవ్రంగా ఉంటుందన్నారు. న్యూరోసిస్టిసెర్కోసిస్ వల్ల సంవత్సరానికి 50,000 మరణాలు సంభవిస్తున్నాయని డాక్టర్ డిసౌజా తెలిపారు.(Source)