వార్నీ.. కుక్క కోసం రెండు దేశాల కొట్లాట.. ఈ డాగ్ చరిత్ర మామూలుగా లేదుగా..

సరిహద్దుల కోసమో, వాణిజ్య వ్యాపారాల కోసమో దేశాలు గొడవ పడటం మనం చూసుంటాం. కానీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకే ఒక్క వీధి కుక్క కోసం రెండు పెద్ద దేశాల మధ్య ఇంటర్నెట్ వేదికగా పెద్ద యుద్ధమే నడుస్తోంది. కారామెల్ డాగ్ మాదంటే మాదని బ్రెజిల్, మెక్సికో దేశాలు ఎందుకు కొట్టుకుంటున్నాయి? అసలు ఓ సాధారణ వీధి కుక్కకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న క్రేజ్ ఏంటో తెలుసుకుందాం..

వార్నీ.. కుక్క కోసం రెండు దేశాల కొట్లాట.. ఈ డాగ్ చరిత్ర మామూలుగా లేదుగా..
Brazil Vs Mexico Dog Dispute

Updated on: Jun 04, 2026 | 8:50 AM

సాధారణంగా దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, వాణిజ్య యుద్ధాలు లేదా రాజకీయ విభేదాలు రావడం మనం చూస్తుంటాం. కానీ ఒక వీధి కుక్క జాతి మాదంటే మాదని రెండు పెద్ద దేశాలు సోషల్ మీడియా వేదికగా కొట్టుకుంటున్న విచిత్రమైన ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే బ్రెజిల్, మెక్సికో దేశాల మధ్య నడుస్తున్న పెర్రో కారామెలో వివాదం. ముదురు గోధుమ రంగులో, చూడ్డానికి ఎంతో ముద్దుగా ఉండే ఈ కారామెల్ డాగ్ కోసం ఈ రెండు లాటిన్ అమెరికా దేశాలు ఎందుకు పోటీ పడుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

300 జాతుల కలయిక.. బ్రెజిల్ గుండెకాయ

బ్రెజిల్ దేశంలోని ప్రతి వీధిలోనూ కనిపించే ఈ కారామెల్ శునకాన్ని అక్కడి ప్రజలు కేవలం ఒక జంతువులా చూడరు. దాన్ని తమ దేశ చరిత్ర, సంస్కృతి, ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తారు. బ్రెజిల్ వాసుల నమ్మకం ప్రకారం.. కొన్ని శతాబ్దాల క్రితం పోర్చుగీసు, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్ వంటి వివిధ దేశాల నుండి వచ్చిన వలసదారులు తమతో పాటు తెచ్చుకున్న పెంపుడు కుక్కల కలయిక వల్లే ఈ సరికొత్త జాతి పుట్టింది. దాదాపు 300 విభిన్న శునక జాతుల సమ్మేళనమే ఈ కారామెల్ డాగ్. దీనికున్న క్రేజ్ ఎంతంటే.. బ్రెజిల్ అధికారిక కరెన్సీ నోట్లపై (ఈ కారామెల్ కుక్క చిత్రాన్ని ముద్రించాలని గతంలో ఆన్‌లైన్‌లో ఒక పిటిషన్ పెడితే, దానికి ఏకంగా 50 వేల మందికి పైగా మద్దతు పలికారు. బ్రెజిలియన్ల జీవితంలో ఇది అంతలా భాగమైపోయింది.

మెక్సికో ఎంట్రీ.. మొదలైన అసలు రచ్చ..

కథ ఇలా సాగుతుండగా, ఊహించని విధంగా మెక్సికో దేశం ఈ వివాదంలోకి ఎంటరై బ్రెజిల్ ప్రజలకు భారీ షాక్ ఇచ్చింది. మెక్సికో ప్రభుత్వ పర్యావరణ సంస్థ అయిన ప్రొపీమ్ ఇటీవల ఒక సంచలన ప్రకటన చేసింది. ఈ కారామెల్ శునక జాతి మెక్సికో సంస్కృతిలో ఒక అంతర్భాగమని పేర్కొంటూ, దాన్ని తమ దేశపు నాలుగో జాతీయ చిహ్నంగా అధికారికంగా గుర్తించింది. అంతేకాదు, దీనికి మెక్సికో చరిత్రతో బలమైన సంబంధాలు ఉన్నాయని ప్రకటించింది.

మా కుక్కను దొంగిలిస్తారా..?

మెక్సికో తీసుకున్న ఈ నిర్ణయంపై బ్రెజిల్ పౌరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మెక్సికో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున డిజిటల్ యుద్ధం మొదలుపెట్టారు. ‘‘కారామెల్ కుక్క కేవలం బ్రెజిల్‌కు మాత్రమే సొంతం.. ఆ జాతితో మెక్సికోకు ఎలాంటి సంబంధం లేదు.. మా దేశ సంస్కృతిని, మా వీధి కుక్కను దొంగిలించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?’’ అంటూ బ్రెజిల్ నెటిజన్లు నిలదీస్తున్నారు. కారామెల్ శునకాన్ని తమ నుంచి ఎవ్వరూ దూరం చేయలేరని ఎలుగెత్తుతున్నారు. మొత్తానికి ఒక సాధారణ వీధి కుక్క జాతి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో రెండు దేశాల మధ్య సాంస్కృతిక యుద్ధానికి కేంద్రబిందువుగా మారింది. ఈ కారామెల్ వివాదం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Follow Us