Trending: దొంగలు చేసే కొన్ని పనులు భలే నవ్వు తెపిస్తాయి. జనాల కంట పడకుండా ఉండేందుకు… పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు కొందరు దొంగలు భలే కథలు పడతారు. తాజాగా యూకేలో అలాంటి ఘటనే వెలుగుచూసింది. పోలీసులు జైలు శిక్ష పడిన ఓ కారు దొంగను అదుపులోకి తీసుకునేందుకు ఓ ఇంటికి వచ్చిన క్రమంలో దోషి ఓ పెద్ద టెడ్డీబేర్ లోపల నక్కాడు. టెడ్డీబేర్ లోపల ఉన్న క్లాత్‌ను అంతా తీసేసి.. అతను లోపలకు దూరాడు. కానీ పోలీసులకు సింపుల్‌గా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. 18 ఏళ్ల జాషువా డాబ్సన్ కారును దొంగిలించాడని.. అదే రోజు బంక్‌లో పెట్రోల్ కొట్టించుకుని డబ్బు ఇవ్వకుండా పరారయ్యాడని మేలో అభియోగాలు నమోదయ్యాయి. నేర నిరూపణ అవ్వడంతో కోర్టు అతడికి తొమ్మిది నెలల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో పోలీసులకు అతను ఓ ఇంట్లో ఉన్నాడని సమాచారం వచ్చింది. దీంతో అరెస్ట్ చేసేందుకు రోచ్‌డేల్‌లోని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు(Greater Manchester Police) అక్కడికి వెళ్లారు. కానీ ఈ ఇంట్లో అణువణువు వెతికినా నిందితుడు కనిపించలేదు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ పెద్ద టెడ్డీబేర్‌పై వారి ఫోకస్ పడింది. ఎందుకంటే ఆ టెడ్డీబేర్ ఊపిరి తీసుకుంటూ కనిపించింది. దీంతో కాప్స్‌కు అసలు విషయం అర్థమయ్యింది. వెంటనే లోపల నక్కి ఉన్న దోషిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ను తప్పించుకునేందుకు డాబ్సన్ ఈ పాచిక వేశాడని.. కానీ అది పారలేదని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని డిపార్ట్‌మెంట్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై వేలాది మంది సోషల్ మీడియా నెటిజన్లు స్పందింస్తున్నారు. అరెస్టు సమయంలో అధికారి బాడీ క్యామ్ ఫుటేజీని విడుదల చేయాలని పలువురు పోలీసు శాఖను కోరుతున్నారు.