పురాతన ఈజిప్షియన్ కళాఖండాల నిధిని పురావస్తు శాస్త్రవేత్తలు మొదటిసారిగా ప్రపంచానికి విడుదల చేశారు. 250మమ్మీల శవ పేటికలను కైరోకు సమీపంలోని సక్కారా సమాధుల నుంచి పురాతత్వ శాస్త్రవేత్తలు బయటికి తీశారు. ఈ కళాఖండాలు 2,500 సంవత్సరాల నాటివిగా గుర్తించారు. కళాఖండాలలో అనుబిస్, అమున్, మిన్, ఒసిరిస్, ఐసిస్, నెఫెర్టమ్, బాస్టెట్ మరియు హాథోర్ దేవతల విగ్రహాలు ఉన్నాయి. అలాగే సక్కార పిరమిడ్‌ను నిర్మించిన వాస్తుశిల్పి ఇమ్హోటెప్ తల లేని విగ్రహం కూడా ఉన్నట్టు గుర్తించారు. అవన్నీ క్రీస్తుపూర్వం 500 నాటివని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈజిప్టు పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ 250 శవపేటికలు, 150 కాంస్య విగ్రహాలు మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంది. కాగా, తవ్వకాల్లో బయల్పడిన ఈ కళాఖండాలన్నింటినీ న్యూ గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియంకు తరలించారు. గిజా పిరమిడ్స్ కు సమీపంలో ఈ మ్యూజియంను నిర్మిస్తున్నారు.
ఈజిప్ట్ పురాణాల ప్రకారం సంతాన దేవతైన ఐసిస్ కు పూజలు చేసిన కంచు పాత్రలు లభించాయని సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటిక్విటీస్ అధిపతి ముస్తఫా వజీరీ చెప్పారు. క్రీస్తుపూర్వం 2630, క్రీస్తు పూర్వం 2611 మధ్య ఈజిప్ట్ ను పాలించిన ఫారో దజోసర్ దగ్గర ఆర్కిటెక్ట్ గా పనిచేసిన ఇమోటెప్ కంచు విగ్రహం కూడా లభించిందన్నారు. శవపేటికల్లో మమ్మీలతో పాటు తాయెత్తులు, చెక్క బాక్సులు, నెఫిథిస్, ఐసిస్ చెక్క బొమ్మలున్నట్టు పేర్కొన్నారు. పెయింట్ చేయబడిన చెక్క శవపేటికలు ఖననం షాఫ్ట్‌లలో చెక్కుచెదరకుండా ఉన్నాయి. ‘బుక్ ఆఫ్ ద డెడ్’ అనే పుస్తకంలో పొందుపరిచిన సూక్తులూ ఓ శవపేటికలో కనిపించినట్టు నిర్ధారించారు. వాటిని నిర్ధారించుకునేందుకు ఈజిప్షియన్ మ్యూజియం ల్యాబ్ కు పంపించారు.