ఓ వ్యక్తి రాత్రిపూట ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్నాడు. చుట్టుప్రక్కల ఉన్నవారంతా తమ పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఈలోపు ఓ పెట్రోలింగ్ వాహనం అటుగా రావడంతో అతడి పరుగు అందుకున్నాడు.. సీన్ కట్ చేస్తే..
వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని నార్కోటిక్స్ క్రైమ్ బ్రాంచ్ సెల్ ఓ నైజీరియన్ వ్యక్తి నుంచి సుమారు రూ. 24 లక్షలు విలువ చేసే 80 గ్రాముల కొకెయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. శాంటాక్రూజ్ ప్రాంతంలోని ఎయిర్ ఇండియా కాలనీలో జూలై 1వ తేదీ రాత్రివేళ చుక్వుమా ఒగ్బోన్నా న్వేకే(32) అనే నైజీరియన్ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులకు కనిపించాడు. పెట్రోలింగ్ వాహనాన్ని చూసి అతడు పరుగు అందుకోవడంతో.. వెంబడించి అతడ్ని పట్టుకున్నారు. ఆ వ్యక్తి దగ్గరున్న బ్యాగ్ చెక్ చేయగా కొకెయిన్ లభ్యమైనట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. పట్టుబడ్డ వ్యక్తి అంతర్జాతీయ డ్రగ్ సిడికేట్ సభ్యుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరికొంతమంది నైజీరియన్లకు ఈ రాకెట్‌లో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈస్ట్ అంధేరీలోని సకినాకా పోలీస్ స్టేషన్‌లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద న్వేకే(Nwaeke)పై ఓ కేసు పెండింగ్‌లో ఉందని పోలీసులు చెప్పారు.