అవార్డు గ్రహీత అయిన జోర్డన్ సంతతికి చెందిన అమెరికన్ రచయిత్రి నటాషా టైన్స్ చేసిన ట్వీట్ పెద్ద దుమారానికి తెర లేపింది. ఈ ఏడాది మే 10న నటాషా అమెరికాలో మెట్రో రైలులో ప్రయాణిస్తుండగా.. మెట్రో నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థలో పనిచేసే కార్మికురాలు ట్రైన్‌లో టిఫిన్ చేయడాన్ని ఆమె గమనించారు. ఇది నిబంధనలకు విరుద్దమంటూ తాను చేసిన హెచ్చరికకు ఆ కార్మికురాలు దురుసుగా సమాధానం ఇవ్వడంతో నటాషా దీనిపై ఆ సంస్థకు ట్వీట్ చేశారు. అయితే నల్లజాతికి చెందిన ఓ కార్మికురాలి పై నటాషా జాత్యాహంకారాన్ని ప్రదర్శించారంటూ ట్విట్టర్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నటాషా ఆ ట్వీట్‌ను తొలిగించడంతో పాటు తన ట్విట్టర్ ఖాతాను కూడా మూసివేశారు. అయితే నటాషా తన పుస్తక ప్రచురణ, పంపిణీ కోసం ఒప్పందం చేసుకున్న రేర్ బర్డ్ సంస్థ ఆమె ట్వీట్ వివాదం నేపథ్యంలో.. డీల్‌ను రద్దు చేసుకుంది. దీంతో నటాషా కోర్టును ఆశ్రయించారు. బుక్ పబ్లిషర్ రేర్ బర్డ్‌పై 13 మిలియన్ డాలర్లకు అంటే సుమారు రూ. 90.2కోట్ల పరువునష్టం దావా వేశారు.