
కృత్రిమ మేధ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో ఏఐ దుర్వినియోగంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఏఐని ఉపయోగించి జీవాయుధాలను రూపొందించడం ప్రమాదకర పరిణామాలకు దారితీయవచ్చని నివేదిక హెచ్చరించింది. జీవాయుధాల వల్ల భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. మానవాళి మనుగడకే ముప్పు ఏర్పడవచ్చు. అయితే, ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేసే అవకాశాలను ముందుగానే గుర్తించి అడ్డుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది లాన్సెట్ కమిషన్ నివేదిక. 35 మంది నిపుణులు తమ పరిశోధనా ఫలితాలను జర్మనీలో జరిగే ప్రపంచ ఆరోగ్య సదస్సు (వరల్డ్ హెల్త్ సమిట్)లో ప్రదర్శించనున్నారు.
ప్రపంచ దేశాల మధ్య అణుయుద్ధం సంభవిస్తే దాని ప్రభావం యుద్ధం జరిగే ప్రాంతాలకే పరిమితం కాదు. అణు పేలుళ్ల వల్ల భారీ స్థాయిలో ధూళి, పొగ, ఇతర కణాలు వాతావరణంలోని పై పొరల్లోకి చేరి సూర్యరశ్మిని అడ్డుకుంటాయి. దాంతో ఉష్ణోగ్రతలు పడిపోవం, వ్యవసాయ ఉత్పత్తి తగ్గడం, ఆహార కొరత వంటి పరిణామాలు సంభవిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా పంటల దిగుబడి తీవ్రంగా తగ్గి కోట్లాది మంది ప్రజలు ఆకలి సమస్య ఎదుర్కోక తప్పదు. ఆహార సంక్షోభం మానవాళి మనుగడను కూడా ప్రశ్నార్థకంగా మారుస్తుందని నివేదిక హెచ్చరించింది.
అణుయుద్ధం, ఏఐ దుర్వినియోగం మరో 15 ప్రధాన ముప్పులను ‘లాన్సెట్’ గుర్తించింది. వాయు కాలుష్యం, వాతావరణ మార్పులు, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, చిన్నారుల్లో పోషకాహార లోపం, సంప్రదాయ యుద్ధాలు, అంతర్జాతీయ ఆరోగ్య సహాయ నిధుల్లో కోతలు, అధిక మద్యపానం, అధిక రక్తపోటు, ఆదాయ అసమానతలు, విద్యా స్థాయులు తక్కువ ఉండటం, కొత్త మహమ్మారులు, ఊబకాయం, మానసిక సమస్యలు, ధూమపానం, వృద్ధాప్యంలో అనారోగ్యం. ఈ సమస్యలన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకు, పేదరికం, విద్యా లోపం, పోషకాహార సమస్యలు ప్రజల ఆరోగ్యాన్ని బలహీనం చేస్తాయి. వాతావరణ మార్పులు ఆహార భద్రత, తాగునీటి లభ్యత, అంటువ్యాధుల వ్యాప్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రపంచ ఉష్ణోగ్రతల ప్రభావాన్ని అంచనా వేయడానికి పరిశోధకులు ‘డిసెబిలిటీ-అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్’ (DALYs) అనే కొలమానాన్ని ఉపయోగించారు. అనారోగ్యం, వైకల్యం లేదా అకాల మరణాల కారణంగా కోల్పోయే ఆరోగ్యకర జీవిత సంవత్సరాలను అంచనా వేసారు. ఉష్ణోగ్రతల పెరుగుదల 4.4 డిగ్రీల సెల్సియస్‌కు చేరకుండా, 1.8 డిగ్రీల సెల్సియస్ స్థాయిలో పరిమితం చేయగలిగితే.. 189 కోట్ల మంది ఆరోగ్యకర జీవిత సంవత్సరాల నష్టాన్ని నివారించవచ్చని నివేదిక అంచనా వేసింది. వాతావరణ మార్పులను నియంత్రించేందుకు దేశాలు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది.
పేద దేశాల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి అంతర్జాతీయ సహాయ నిధుల్లో భారీ కోతలు పడినా లేదా సహాయం పూర్తిగా నిలిచిపోయినా 2100 నాటికి 150 కోట్ల మంది ఆరోగ్యకర జీవిత సంవత్సరాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నష్టంలో దాదాపు 70 శాతం ఆఫ్రికాలో సంభవించనుంది. ఇప్పటికే అక్కడ చిన్నారుల్లో పోషకాహార లోపం ప్రధాన సమస్య కావడం వైద్య సేవలు, టీకాలు, పోషకాహార కార్యక్రమాలకు నిధులు తగ్గి పరిస్థితులు దిగజారాయి.
అధిక ఆదాయం ఉన్న దేశాల్లో ఊబకాయం, మానసిక సమస్యలు సవాళ్లుగా మారితే.. తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో అవిద్య, చిన్నారుల్లో పోషకాహార లోపం దెబ్బతీస్తాయి. ‘ప్రస్తుత ప్రభుత్వ నేతలు తీసుకునే నిర్ణయాలు.. భవిష్యత్తు తరాల ఆరోగ్యం, సంక్షేమాన్ని ప్రభావితం చేస్తాయి’ అన్నారు లాన్సెట్ కమిషన్ సహ అధ్యక్షుడు డాక్టర్ క్రిస్టోఫర్ ముర్రే కీలక. మూడు సంవత్సరాలకు ముందు అధ్యయనం ప్రారంభించినప్పుడు యుద్ధాలు, వాతావరణ మార్పులు, మహమ్మారులనే ప్రధాన ముప్పుగా భావించారు. ఇప్పుడు మానవాళి ఎదుర్కొనే ప్రమాదాల జాబితా పెరిగిందనీ, ముందుగానే గుర్తించి నివారణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనీ కోరారు. 2100 నాటికి మానవాళి అంతమవుతుందని ఈ నివేదిక కచ్చితంగా చెప్పకపోయినా ఏఐ దుర్వినియోగం, అణుయుద్ధం, వాతావరణ మార్పులను నిర్లక్ష్యం చేస్తే ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.