Video: ఆర్మీ యూనిఫామ్‌లో తొలిసారి ఇంటికి.. ఎదురుగా తండ్రి అంతిమయాత్ర! కన్నీళ్లు పెట్టించే సీన్

గుండెపోటుతో తండ్రి మృతి చెందిన వార్త తెలిసిన అగ్నివీర్ సైనికుడు సన్నీ రావత్ 1,100 కిలోమీటర్లు ప్రయాణించి స్వగ్రామానికి చేరుకున్నాడు. యూనిఫాంలోనే తండ్రికి చివరి వందనం చేసిన అతని భావోద్వేగ క్షణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో సైనికుల కుటుంబాల త్యాగాలను మరోసారి గుర్తు చేస్తూ లక్షలాది మందిని కదిలిస్తోంది.

Video: ఆర్మీ యూనిఫామ్‌లో తొలిసారి ఇంటికి.. ఎదురుగా తండ్రి అంతిమయాత్ర! కన్నీళ్లు పెట్టించే సీన్
Agniveer Soldiers Final Salute To His Father

Updated on: Jul 29, 2026 | 8:01 AM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వినోదాన్ని పంచితే, మరికొన్ని మనసును కదిలిస్తాయి. తాజాగా అలాంటి హృదయాన్ని హత్తుకునే వీడియో ఒకటి నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది. తన కొడుకు ఆర్మీలో చేరి ఈ దేశానికి సేవ చేయాలని ఆ తండ్రి ఎన్నో కలలు కన్నాడు. తండ్రి ఆశయాన్ని సాధిస్తూ.. ఆ కొడుకు సైతం క్రమ శిక్షణతో కష్టపడి ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్‌గా చేరాడు. అయితే తన కొడుకు దేశానికి సేవ చేస్తున్నాడని ఊరంతా గర్వంగా చెప్పుకునే తండ్రి, తన కుమారుడని నేరుగా ఆర్మీ యూనిఫామ్‌లో చూడకుండానే కన్నుమూశాడు. దీంతో తండ్రి మరణించిన వార్త తెలుసుకున్న ఓ అగ్నివీర్ సైనికుడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లా నర్వార్‌లోని స్వగ్రామం భవానీ ఖేరాకు చేరుకుని, సైనిక యూనిఫాంలోనే తన తండ్రికి చివరి వందనం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అగ్నివీర్ సైనికుడు సన్నీ రావత్‌కు తన తండ్రి కిర్పాల్ సింగ్ గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందినట్లు సమాచారం అందింది. విధి నిర్వహణలో ఉన్న సన్నీ వెంటనే స్వగ్రామానికి బయల్దేరి దాదాపు 1,100 కిలోమీటర్లు ప్రయాణించి కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్నాడు. తండ్రి పార్థివదేహం వద్దకు చేరుకున్న అనంతరం అతను సైనిక యూనిఫాంలోనే నిలబడి చివరి వందనం చేయడం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది.

కిర్పాల్ సింగ్ తన కుమారుడు భారత సైన్యంలో చేరి యూనిఫాం ధరించడాన్ని ఎంతో గర్వంగా భావించేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన కుమారుడు దేశసేవలో ఉండటం ఆయనకు ఎప్పుడూ గర్వకారణమే. అదే యూనిఫాంలో తన కుమారుడు చివరిసారిగా సెల్యూట్ చేయడం చూసిన బంధువులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి కలను నెరవేర్చిన కుమారుడు, అదే కలకు గౌరవంగా తన చివరి వీడ్కోలు పలకడం ఎంతో మందిని కదిలించింది. వైరల్ అవుతున్న వీడియోలో సన్నీ రావత్ ఎలాంటి భావోద్వేగానికి లోనైనా తన సైనిక క్రమశిక్షణను కోల్పోకుండా గంభీరంగా నిలబడి తండ్రికి చివరి సెల్యూట్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us