ప్రస్తుతం అన్నీ, అంతటా ఆన్‌లైన్ లావాదేవీలు కొనసాగుతున్నాయి. ఇదే అదునుగా చేసుకుంటున్న కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కొందరు మోసగాళ్లు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దొంగిలిస్తుంటే.. మరికొందరు కొత్త ఉద్యోగాలు, కొత్త పెట్టుబడుల పేరిట అమాయకులను నిలువునా ముంచేస్తున్నారు. మీ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేస్తున్నట్లు ఫోన్ చేస్తుంటారు.. నమ్మిన వారి ఖాతాను ఊడ్చేస్తుంటారు. మీకు ఉద్యోగం వచ్చిందంటూ ఫోన్ చేస్తారు..అందుకోసం కొంతమొత్తం డబ్బు చెల్లించాలని చెబుతారు..మీ ఖాతాను బ్లాక్ చేస్తానని బెదిరిస్తారు. అంతేకాదు పెళ్లి పేరుతో కూడా చాలా మంది నమ్మిన వారిని మోసం చేస్తుంటారు. కొన్ని ప్రత్యేకించి ఏర్పాటు చేసిన వెబ్ సైట్ల ద్వారా అమాయకులను టార్గెట్ చేస్తుంటారు కేటుగాళ్లు.. ఇలా రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు కేటుగాళ్లు..ఇక్కడ కూడా అలాంటి ఘటనే ఒకటి మ్యాట్రీమోనియల్ వెబ్ సైట్ ద్వారా చేసిన మోసం వెలుగులోకి వచ్చింది.
మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమైన ఓ యువతి కారణంగా ఓ యువకుడు కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు. గాంధీనగర్ లో పనిచేసే కుల్దీప్ పటేల్ అనే యువకుడు యువతి చేతిలో మోసపోయి పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నాడు. కులదీప్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కుల్దీప్ ఫిర్యాదు ప్రకారం,..సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన కుల్దీప్ పటేల్‌కు గత జూన్‌లో మ్యాట్రిమోనియల్ సైట్‌లో అదితి అనే యువతి పరిచయమైంది. ఆమె UKలో ఎగుమతి-దిగుమతి వ్యాపారమని మహిళ అతనికి చెప్పింది. తర్వాత మహిళ సూచనల మేరకు అతడు క్రిప్టోకరెన్సీ పెట్టుబడి పెట్టాడు. తాను BanoCoinలో పెట్టుబడి పెట్టానని, ఇందుకోసం ఆ మహిళ కస్టమర్ కేర్ ప్రతినిధిగా పరిచయం చేసుకున్న వ్యక్తితో మాట్లాడానని కుల్దీప్ తెలిపాడు.
తొలుత పెట్టిన లక్ష రూపాయల్లో లాభం ఉందని యువతి చూపడంతో కుల్దీప్ ఆమెను మరింతగా నమ్మాడు. దీంతో మరింత ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టారు. జూలై 20 నుంచి ఆగస్టు 31 మధ్య 18 వాయిదాల్లో రూ.1.34 కోట్లు పెట్టుబడి పెట్టినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నాడు. సెప్టెంబరు 3న ఖాతా నుంచి రూ.2.59 లక్షలు విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా.. ఖాతా స్తంభింపజేసినట్లు నోటీసు వచ్చిందని కుల్దీప్ తెలిపాడు.
ఖాతా ఫ్రీజ్ నోటిఫికేషన్‌ను స్వీకరించిన తర్వాత ముందుగా మాట్లాడిన కస్టమర్ కేర్ ప్రతినిధిని సంప్రదించారు. ఖాతాను తిరిగి పొందేందుకు మరో 35 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని అదితిని కోరడంతో అతడు అదితిని సంప్రదించేందుకు ప్రయత్నించాడు. కానీ అదితిని కాంటాక్ట్ కాకపోవడంతో కుల్దీప్ మోసపోయానని గ్రహించాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..