
ఆమెకు 65ఏళ్లు.. పశువుల కోసం మేత కోయడానికి పొలానికి వెళ్లింది. ఇంతలో సడెన్‌గా ఓ మాయదారి క్రూరమైన నక్క ఆమెపై దాడికి దిగింది. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. అయినా భయపడలేదు. ఆడపులిలా గర్జించింది. చీర కొంగునే ఆయుధంగా చేసుకుని తన శక్తితో ఆ నక్కనే నరకానికి పంపించింది. శివ్‌పురి జిల్లాలోని బర్ఖాడీ గ్రామంలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.
గత సోమవారం సాయంత్రం సురజియా అనే వృద్ధురాలు పొలంలో పశువుల మేత కోస్తుండగా నక్క ఆమెపై దాడి చేసింది. నక్క దాదాపు 18 సార్లు ఆమె కాళ్లు, చేతులపై కరిచింది. తీవ్ర గాయాలైనప్పటికీ, ఆమె భయపడలేదు. అరిచినా ఎవరూ సహాయం చేయడానికి లేకపోవడంతో, ఆమె తన శక్తిని కూడగట్టుకుని నక్కపై ఎదురుదాడికి దిగారు. దాదాపు 30 నిమిషాల పోరాటం తర్వాత సురజియా తన చీర కొంగుతో నక్క మెడకు ఉచ్చు బిగించి దానిని చంపేసింది. అనంతరం ఆమె స్పృహ కోల్పోయారు. ఆరు గంటల తర్వాత ఆసుపత్రిలో ఆమెకు స్పృహ వచ్చింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
తాను అరిచేకొద్దీ నక్క దాడిని తీవ్రం చేసిందని సురజియా తెలిపింది. శరీరంలోని శక్తినంతా కూడగట్టుకుని దానిని చంపేసినట్లు గుర్తుచేసుకుంది. ఈ ఘటన సురజియా కుటుంబానికి కొత్తేమీ కాదు. ఆరు నెలల క్రితం ఆమె మరిది లాతురా జాదవ్ కూడా ఇంటిలోకి వచ్చిన నక్కతో పోరాడి దానిని చంపారు. అయితే ఆ గాయాల కారణంగా దురదృష్టవశాత్తు మూడు నెలల క్రితం ఆయన మరణించారు. ఈ నేపథ్యంలో సురజియా భాయి చూపిన ధైర్యం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆమె చూపించిన తెగువకు అందరూ సలాం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..