సృష్టికి ప్రతిరూపం ‘అమ్మ’. అమ్మే ప్రత్యక్ష దైవం. దేవుడు సైతం అమ్మకు తలవంచాల్సిందే. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడటమే కాదు.. వారికి ఎలాంటి కష్టమొచ్చినా తీరుస్తుంది అమ్మ. బిడ్డల సంతోషమే.. తన సంతోషమని అనుకుంటుంది.. వారే తన ప్రపంచం అనుకుంటుంది. అమ్మ రుణాన్ని ఎవ్వరూ తీర్చలేరు. ‘అమ్మ’ గురించి ఇలా ఎంత చెప్పినా తక్కువే. అలాంటి అమ్మ.. మనతో లేకపోతే.. ఆ బాధ వర్ణనాతీతం. ఇప్పుడు మేము చూపించబోయే వీడియో కూడా అలాంటిదే. మీరు దాన్ని చూడగానే కన్నీళ్లు అస్సలు ఆగవు.
వైరల్ వీడియో ప్రకారం.. ‘అమ్మా.. అమ్మా’ అంటూ ఓ పిల్లాడు తన తల్లి సమాధి వద్ద ఏడుస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఇది పాత వీడియో.. అయినప్పటికీ మరోసారి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. పిల్లాడి తల్లి కొద్దిరోజుల క్రితం చనిపోయింది. తన తల్లి ఎక్కడుందని ఆ రెండేళ్ల పిల్లాడు వాళ్ల అమ్మమ్మను అడగ్గా… భూమి లోపల నిద్రిస్తోందని బదులిచ్చింది. దీంతో ఆ పిల్లాడు తన తల్లి సమాధి దగ్గర రంధ్రం చేసి.. ‘అమ్మా.. అమ్మా’ అంటూ పిలిచాడు. ఎంత పిలిచినా తన అమ్మ దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఆ పిల్లాడు ఏడుస్తూ తన బాధను వెల్లబుచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. పిల్లాడి బాధను చూసి.. నెటిజన్లు కన్నీటి పర్యంతం అవుతూ కామెంట్ చేస్తున్నారు.