
తాను 140 ఏళ్ల వృద్ధుడని ఒక ఆఫ్ఘన్ వ్యక్తి తనకు తానుగా ప్రకటించుకున్నాడు. అదే నిజమైతే.. అతను ఇప్పటివరకు జీవించిన వారిలో అత్యంత వృద్ధుడు అవుతాడు. తాను 1880లలో జన్మించానని నొక్కి చెప్పే అఖేల్ నజీర్ ఆఫ్ఘనిస్తాన్‌లోని ఖోస్ట్ ప్రావిన్స్‌లో నివసిస్తున్నాడు. నజీర్ వాదన ప్రకారం, అతను 1919 మూడవ ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధం సమయంలో తనకు 30 ఏళ్ల వయసు ఉండేదని, యుద్ధ సమయంలో తాను అక్కడే ఉన్నానని, ఆఫ్ఘన్లు, బ్రిటిష్ వారి మధ్య వివాదం ముగింపును కూడా జరుపుకున్నానని పేర్కొన్నాడు. “నేను రాజు అమానుల్లా ఖాన్ తో కలిసి రాజభవనంలో ఉన్నాను. ఆ సమయంలో నాకు 30 ఏళ్లు పైబడ్డాయి, బ్రిటిష్ వారు పారిపోయి మోకరిల్లారని నేను చెప్పినట్లు గుర్తుంది. అందరూ సంతోషంగా ఉన్నారు, బ్రిటిష్ వారిని తరిమికొట్టినందుకు రాజు అమానుల్లా ఖాన్ కు కృతజ్ఞతలు తెలిపారు” అని నజీర్ అంటున్నారు.
నజీర్ తనకు 140 ఏళ్ల వయస్సు ఉందని చెప్పుకున్నప్పటికీ, తన వాదనలకు మద్దతు ఇచ్చే పత్రాలు ఏవీ అతని వద్ద లేవు. అందుకే తాలిబన్ ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. నజీర్ వయస్సు వాదనలను విచారించడానికి ప్రత్యేక పౌర రిజిస్ట్రేషన్ బృందాన్ని సిద్ధం చేసినట్లు తాలిబన్ ప్రతినిధి ముస్తాగ్‌ఫర్ గుర్బాజ్ తెలిపారు. “పత్రాలు లేదా అంచనాల ద్వారా నజీర్ వయసు ధృవీకరించబడితే, మేము అతనిని ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా నమోదు చేయడానికి కృషి చేస్తాం” అని ముస్తాగ్‌ఫర్ తెలిపింది.
నజీర్ మనవళ్లలో ఒకరైన ఖ్యాల్ వజీర్ ఇప్పుడు 50 ఏళ్ల వయసున్నాడు, అతనికి కూడా మనవళ్లు కూడా ఉన్నారు. “మా తాతగారికి 140 ఏళ్ల వయస్సు ఉందని నిరూపించడానికి ఒక గుర్తింపు కార్డు లేదా ఏదైనా ఇతర శాస్త్రీయ పద్ధతి లేదా పత్రాలను ఉపయోగించి అతని వయస్సును నిర్ధారించాలని మేము ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము” అని నజీర్ మరో మనవడు అబ్దుల్ హకీమ్ సబారి అన్నారు. నజీర్ కుమారులలో ఒకరైన ఖయాల్ నజీర్‌కు కూడా 100 ఏళ్ల దాటి ఉంటాయని తెలుస్తోంది. దీంతో నజీర్ చెబుతున్నట్లు అతనికి నిజంగానే 140 ఏళ్లు ఉంటాయని చాలా మంది నమ్ముతున్నారు. మరి చూడాలి తాలిబన్లు దర్యాప్తు చేసి ఏం తేలుస్తారో?
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.