ఐక్యరాజ్యసమితి వేదికగా.. పాక్‌ తీరును ఎండగట్టిన భారత్

'Terror Epicentre Creating False J&K Narrative': India Slams Pakistan at UN Human Rights Council, ఐక్యరాజ్యసమితి వేదికగా.. పాక్‌ తీరును ఎండగట్టిన భారత్

ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌ను చీల్చిచెండాడింది భారత్. అంతర్జాతీయ ఉగ్రవాదానికి మూలకేంద్రంగా ఎవరు నిలుస్తున్నారో యావత్ ప్రపంచానికి తెలుసునని, వాళ్లే ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ భారత్‌ నిప్పులుచెరిగింది. జమ్ముకశ్మీర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పాక్ తీరును ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో భారత్ ఎండగట్టింది. యూఎన్‌హెచ్ఆర్‌సీలో భారత్ తరఫున హోం మంత్రిత్వ శాఖ సెక్రటరీ విజయ్ ఠాకూర్ సింగ్ మంగళవారంనాడు ప్రసంగించారు.

మరోసారి పాకిస్థాన్ పాతపాటే పాడుతూ.. జమ్మూకశ్మీర్ అంశం అంతర్జాతీయ అంశమంటూ ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తింది. జమ్మూకశ్మీర్‌ అంశం భారత అంతర్గత వ్యవహారం కాదంటూ పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మెహమూద్ ఖురేషి ప్రసంగించారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలను విజయ్‌ ఠాకూర్ సింగ్ తోసిపుచ్చారు. భారత ప్రభుత్వం తీసుకున్న సార్వభౌమాధికార నిర్ణయాలు పూర్తిగా తమ దేశ అంతర్గత వ్యవహారమని విజయ్ ఠాకూర్ సింగ్ కుండబద్ధలు కొట్టారు. పార్లమెంటులో ఆమోదించిన ఇతర నిర్ణయాల తరహాలోనే కశ్మీర్ విషయంలో పార్లమెంటు తీసుకున్న నిర్ణయం పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారమని, వాటిలో ప్రపంచంలోని ఏ దేశం ప్రమేయాన్ని కూడా అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.

కశ్మీర్‌లో ప్రగతిశీల విధానాలను పూర్తిగా అమలు చేయనున్నామని ఠాకూర్ సింగ్ తెలిపారు. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ పాక్ పూర్తిగా తప్పుడు కథనాలు, కట్టుకథలు ప్రచారం చేస్తోందన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదానికి ఎవరు కేంద్ర స్థానంగా నిలుస్తున్నారో, ఉగ్రవాదులకు ఆశ్రయం, నిధులు అందించడం చేస్తున్నారో ప్రపంచం మొత్తానికి తెలుసునని పరోక్షంగా పాక్‌ తీరును ఎండగట్టారు.

భారత ప్రభుత్వం ఇటీవల తీసుకున్న శానస పరమైన చర్యలతో జమ్మూకశ్మీర్, లడఖ్‌లలో అభివృద్ధి పథకాలు అమల్లోకి వస్తాయన్నారు. లింగ వివక్షకు తెరపడుతుందని, బాలనేరస్థుల హక్కులకు మెరుగైన రక్షణ లభిస్తుందని, విద్య, సమాచార హక్కులకు భరోసా ఉంటుందన్నారు. సామాజిక-ఆర్థిక సమానత్వం, సమన్యాయానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని, కట్టుదిట్టమైన, ప్రగతిశీల విధానాలు అమలు చేస్తోందని ఠాకూర్ సింగ్ తెలిపారు.

ఇక ఎన్‌ఆర్‌సీపై మాట్లాడుతూ, ఎన్సార్సీకి చట్టబద్ధత ఉందని, పారదర్శకంగా, వివక్షా లేకుండా చట్టబద్ధమైన ప్రక్రియ ఉంటుందని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ జరుగుతోందని ఠాకూర్ సింగ్ తెలిపారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, అమలు చేసినా అవి పూర్తిగా భారతీయ చట్టాలు, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు అనుగుణంగా ఉంటాయని ఠాకూర్ సింగ్ ప్రసంగంలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *