తెలంగాణలో రాజన్నరాజ్యం రావాలి, ఈ ప్రభుత్వంలో రైతులంతా సంతోషంగా ఉన్నారా? విద్యార్థులంతా ఫ్రీగా చదువుకుంటున్నారా.? : వైఎస్ షర్మిల

|

Feb 09, 2021 | 3:38 PM

తెలంగాణలో రాజన్నరాజ్యం రావాలన్నారు వైఎస్ షర్మిల. ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వంలో రైతులంతా సంతోషంగా ఉన్నారా? అని ఆమె హైదరాబాద్ లోని..

తెలంగాణలో రాజన్నరాజ్యం రావాలి, ఈ ప్రభుత్వంలో రైతులంతా సంతోషంగా ఉన్నారా? విద్యార్థులంతా ఫ్రీగా చదువుకుంటున్నారా.? : వైఎస్ షర్మిల
Follow us on

తెలంగాణలో రాజన్నరాజ్యం రావాలన్నారు వైఎస్ షర్మిల. ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వంలో రైతులంతా సంతోషంగా ఉన్నారా? అని ఆమె హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తోడబుట్టిన అన్న అని చెప్పిన ఆమె, జగన్ సహకారం తనకు ఉంటుందని భావిస్తున్నానని వెల్లడించారు. తెలంగాణలో విద్యార్థులందరూ ఉచితంగా చదువుకుంటున్నారా.. మీరు చెప్పండి అంటూ విలేకరులను షర్మిల అడిగారు. ఈరోజులాంటి సమావేశాలు ప్రతి జిల్లాలోనూ ఇక మీదట నిర్వహిస్తామని, పార్టీని ఏవిధంగా నిర్మించాలనేది ప్రతీ జిల్లా వాళ్లతో చర్చిస్తామని షర్మిల అన్నారు.

కాగా, క్లిస్టర్ క్లియర్ గా తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు వైఎస్ షర్మిల తేల్చేశారు. వైఎస్సార్‌‌టీపీ పేరుతో పార్టీ ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు.. కొత్త పార్టీతో ఎందుకు రాకూడదు అని ఆమె ఫస్ట్ రియాక్షనిచ్చారు. ఎక్స్‌క్లూజివ్‌గా టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏర్పాటు అంశాన్ని ఖరారు చేశారు షర్మిల. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పేరుతో ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్టు కూడా సమాచారం.

బెంగళూరు నుంచి ఈ ఉదయమే హైదరాబాద్‌లో దిగిన ఆమె… నేరుగా లోటస్ పాండ్‌కు వచ్చారు. చాలారోజుల తర్వాత లోటస్ పాండ్‌కు వచ్చిన ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. జై షర్మిలక్క అంటూ నినాదాలు చేశారు అభిమానులు. జోహార్ వైఎస్‌ఆర్‌ అంటూ స్లోగన్స్‌తో లోటస్ పాండ్ మారుమోగిపోయింది. భారీగా తరలివచ్చిన అభిమానులతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.

తెలంగాణలో గ్రౌండ్‌ రియాల్టీ తెలుసుకునేందుకు సమావేశాలు ఏర్పాటు చేసినట్టు టీవీ9తో స్వయంగా షర్మిల చెప్పారు. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదన్న షర్మిల… వైఎస్సార్‌ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తెలంగాణలో వస్తాం… రాజన్న రాజ్యం తీసుకొస్తామని కుండబద్ధలు కొట్టారు. నల్గొండ జిల్లా నేతలతో చర్చిస్తున్నామని.. ఇకమీదట అన్ని జిల్లాల నేతలతోనూ సమావేశం కానున్నట్టు షర్మిల తెలిపారు. ప్రతి జిల్లా నేతలతోనూ కలుస్తామన్నారామె.

తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు నిర్ణయంపై వైసీపీ ముఖ్యనేత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల నిర్ణయంపై తప్పుడు భాష్యాలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై మంగళవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. షర్మిల తమ అందరి ఆత్మీయ సోదరి అని పేర్కొన్నారు.

వైఎస్ జగన్ జైలులో ఉన్నప్పుడు వైసీపీకి అన్నీ తానై వ్యవహరించారని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేశారని సజ్జల గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సరస్పర సహకారం ఉండాలని జగన్ భావించారని సజ్జల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది ఉంటుందనే తెలంగాణలో పార్టీని వద్దనుకున్నామని ఆయన వెల్లడించారు.

పార్టీని బలోపేతం చేసేందుకు తెలంగాణలో ఏ ప్రయత్నం చేసినా.. ఏపీలో గ్యాప్ ఏర్పడే అవకాశం వస్తుందని జగన్ భావించారని చెప్పుకొచ్చారు. పార్టీ విస్తరణ వల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఉండదని జగన్ అభిప్రాయం అని పేర్కొన్నారు. ఈ కారణంగానే షర్మిల పార్టీ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని కూడా వద్దని నచ్చజెప్పేందుకు జగన్ ప్రయత్నించారని ఆయన తెలిపారు.

పార్టీ ఏర్పాటు వల్ల కలిగే కష్ట, నష్టాలు, రాజకీయంగా ఉన్న పరిమితులు ఇవన్నీ షర్మిలకు జగన్ వివరించారని సజ్జల చెప్పారు. కానీ, షర్మిల తన స్వీయ అనుభవంతో పార్టీ ఏర్పాటు చేయాలని బలంగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందన్న ఆయన.. పార్టీ ఏర్పాటుకు సంబంధించి ప్రతి అంశానికి షర్మిలనే బాధ్యురాలు అవుతారని సజ్జల స్పష్టం చేశారు. అయితే జగన్, షర్మిల వ్యక్తిగత సంబంధాలకు, పార్టీలకు సంబంధం ఏమాత్రం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

అయితే.. జగన్, షర్మిల మధ్య విబేధాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై సజ్జల క్లారిటీ ఇచ్చారు. షర్మిల, జగన్ మధ్య విబేధాలు లేవని, వారివి కేవలం భిన్నాభిప్రాయాలు మాత్రమే అని స్పష్టం చేశారు. తెలంగాణలో షర్మిలను పార్టీ పెట్టొద్దని జగన్ సూచించారని సజ్జల తెలిపారు. ఈ నిర్ణయం వల్ల తమపై నమ్మకం పెట్టుకున్న వారికి న్యాయం చేయలేమేమో అని జగన్ భావిస్తున్నారని చెప్పారు.

అయితే, తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై షర్మిల ఇప్పుడే నిర్ణయం తీసుకోలేదని సజ్జల పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి కూతురు అయిన షర్మిల సహజంగానే భిన్న ఆలోచనలు చేస్తుండొచ్చని, ఆ కారణంగానే ఆమె తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుని ఉంటారని సజ్జన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.