
వరంగల్‌లోని ఎనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డుకు మిర్చి అమ్మకానికి పోటెత్తుతుంది. ఎర్ర బంగారం బస్తాల మధ్య అక్కడక్కడ పచ్చ మిర్చి ధగధగ మెరిసి పోతుంది. పచ్చ మిర్చి ధరలు కూడా తళుక్కుమంటున్నాయి.. ప్రస్తుతం ఎర్ర బంగారానికి ఆరంభంలో మార్కెట్ ధరలు ఆహా ఓహో అనిపిస్తున్నాయి. పూర్తిగా మిర్చి చేతికి వచ్చిన తర్వాత ధరలు మురిపిస్తాయో.. రైతులకు కన్నీళ్లు కురిపిస్తాయో ఏమో కానీ ఇప్పుడు మాత్రం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డులో వండర్ హార్ట్ రకం మిర్చి క్వింటా రూ. 26,200/-, తేజా క్వింటా రూ.22,000, దీపికా రకం మిర్చి క్వింటాకు రూ 26,200, US 341రకం మిర్చి క్వింటాకు 25,500 రూపాయలు ధర పలుకుతుంది. ముఖ్యంగా ఎల్లో మిర్చి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం క్వింటా ఎల్లో మిర్చి రూ.44,000 రూపాయలు పలుకుతుంది. 20వ తేదీ మంగళవారం క్వింటా ఎల్లోమిర్చి 42,500 తెలపలికింది. ఈరోజు అదే ఎల్లో మిర్చి క్వింటా 44వేల రూపాయల రికార్డు ధర నమోదు కావడంతో రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఎల్లోమిర్చికి ఇలా రికార్డు ధరలు రావడం ఇదే ప్రథమం. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్లోమిర్చికి ఎక్కువగా డిమాండ్ ఉండడం వల్లే ఇలా ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. ఈ మిర్చిని చైనా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఎల్లో రంగు మిర్చిని ఎక్కువగా పెప్పర్ ఐటమ్ గా ఉపయోగిస్తుంటారు. కలర్స్ తయారీ, మెడిసిన్, కాస్మోటిక్ తయారి, చిప్స్ పైన పెప్పర్ గా ఉపయోగిస్తుంటారు.
అయితే సాధారణ మిర్చితో పోల్చితే ఎల్లో మిర్చి పంట దిగుబడి కొంత తక్కువగా వస్తుంది కాబట్టి సాగు విస్తీర్ణం కూడా చాలా తక్కువగా ఉంటుంది.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ఎకరాల మేర ఈ మిర్చి సాగు జరుగుతుంది.. ఎల్లో మిర్చికి ఎందుకంత డిమాండ్.. ఈ మిర్చికి రికార్డు స్థాయి ధరలు చెల్లిస్తున్న వ్యాపారులు అంటున్నారు.
ఈ ఏడాది దేశవ్యాప్తంగా మిర్చి సాగు విస్తీర్ణం తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మన దగ్గర సాగుచేసే మిర్చికి ప్రస్తుతం డిమాండ్ పెరగడం వల్ల ధరలకు రెక్కలొచ్చాయని మార్కెట్ యార్డ్ అధికారులు అంటున్నారు.ఈ ధరలు మరింత పెరగవచ్చు అంటున్న ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేష్ అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.