
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి మహిళల నుంచి అద్భుత ఆదరణ లభిస్తుంది. అయితే ఇదే సమయంలో ఆర్టీసీ బస్సుల్లో రోజుకో వింత సంఘటన చోటుచేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. సీట్ల కోసం మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం, కూరగాయలు తరలించడం, బస్సులోనే కూరగాయలు కోయడం, పళ్లు తోముకోవడం వంటి ఘటనలు ఇప్పటికే వైరల్ కాగా.. తాజాగా మరో విచిత్రమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఆర్టీసీ బస్సులోనే కల్లు సీసాతో కూర్చుని ఓ మహిళ హల్‌చల్ చేసింది.
నారాయణపేట బస్టాండ్‌లో నిలిపి ఉన్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు ఎక్కిన ఓ మహిళ తన వెంట తెచ్చుకున్న కల్లు సీసాను బయటకు తీసి, డ్రైవర్ సీటు పక్కన ఉన్న ఇంజిన్ బానెట్‌పై కూర్చుని తాగేందుకు సిద్ధమైంది. దీన్ని గమనించిన తోటి ప్రయాణికులు, బస్సు కండక్టర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బస్సులో ఇలాంటి చర్యలు నిబంధనలకు విరుద్ధమని హెచ్చరిస్తూ ఆమెను వారించే ప్రయత్నం చేశారు. కండక్టర్, డ్రైవర్ వారించినప్పటికీ ఆ మహిళ ఏమాత్రం తగ్గకుండా వారితో తీవ్ర వాగ్వాదానికి దిగింది. బహిరంగంగా మద్యం, కల్లు సేవించడం నేరమని గుర్తుచేసినా వినకుండా మొండికేసింది. అయితే బస్సులోని ఇతర ప్రయాణికులు సైతం ఆమె తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూకుమ్మడిగా నిలదీయడంతో ఆమె వెనక్కి తగ్గి కల్లు తాగడం ఆపేసింది.
ఈ తతంగమంతా అక్కడున్న కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి, ఇలాంటి పనులతో ఆర్టీసీ ప్రతిష్టను దెబ్బతీయడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బస్సుల్లో భద్రత, ప్రయాణికుల ప్రవర్తనపై ఆర్టీసీ అధికారులు మరింత కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.