Palapitta: దసరా రోజు పాలపిట్టను చూడాలని ఎందుకు అంటారు.. పంజరంలో చూస్తే దోషమా..
దసరా పర్వదినాన ప్రత్యేక ఆచారం పాలపిట్ట దర్శనం.. పాలపిట్ట దర్శనం వెనుక ఉన్న అసలు విశ్వాసం ఏంటి..! దసరా పండుగకు.. పాలపిట్టకు సంబంధమేంటి..? దసరా పర్వదినాన పాలపిట్ట దర్శనం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..?పాలపిట్టను పట్టి పంజరంలో బంధిస్తే కేసులు తప్పవని అటవీశాఖ ఎందుకు హెచ్చరిస్తుంది.. పాలపిట్ట దర్శనం ఆచారమా.? మూడ విశ్వాసమా.? దీని వెనక ఉన్న అసలు కథేంటో ఇక్కడ తెలుసుకుందాం.

దసరా పర్వదినాన పాలపిట్ట దర్శనం చేసుకోవడం ఒక ప్రత్యేక ఆచారంగా కొనసాగుతోంది. శమీ (జమ్మి) చెట్టుపై వాలిన పాలపిట్ట దర్శనమిస్తే ఎంతో శుభసూచకమని భక్తుల నమ్మకం. దసరా రోజున పాలపిట్టను చూడటం కంటికి కనువిందు చేయడమే కాకుండా, మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఈ దసరా పండుగకు, పాలపిట్ట దర్శనానికి వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది.
పురాణాల ప్రకారం పాండవులు అరణ్యవాస సమయంలో తమ ఆయుధాలను శమీ వృక్షంపై భద్రపరిచారు. అనంతరం అజ్ఞాతవాసం ముగించుకుని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లే సమయంలో అర్జునుడు శమీ చెట్టుపై ఉన్న పాలపిట్టను దర్శించుకుని వెళ్లడం వల్లే విజయం సులభమైందని ఒక కథనం ప్రచారంలో ఉంది. అందుకే దసరా పర్వదినాన శమీ చెట్టుపై ఉన్న పాలపిట్టను దర్శించడం లేదా ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పాలపిట్టను చూసి తరించడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది.
పాలపిట్ట దర్శనం వెనుక ఎలాంటి పురాణ చరిత్ర ఉన్నప్పటికీ, దసరా నాడు పాలపిట్టను చూడటం నేడు ఒక బలమైన సెంటిమెంట్‌గా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడా పాలపిట్టలు స్వేచ్ఛగా ఎగురుతూ దర్శనమిస్తున్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇవి అస్సలు కనిపించడం లేదు. అయితే ఈ సంప్రదాయం పేరిట కొందరు పాలపిట్టలను పంజరాల్లో బందీలుగా మార్చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
భక్తుల సందర్శనార్థం కొన్ని ఆలయాల వద్ద పాలపిట్టలను పంజరాల్లో బంధించి దర్శనం కల్పిస్తుండగా, మరికొందరు జూ పార్కులకు వెళ్లి చూసి వస్తున్నారు. అయితే ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పాలపిట్టను చూస్తేనే కార్యసిద్ధి కలుగుతుంది తప్ప, పంజరంలో బంధించిన పిట్టను చూడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పండితులు స్పష్టం చేస్తున్నారు.
సాధారణంగా పాలపిట్టతో పాటు నల్లపిట్ట దర్శనాన్ని కూడా కొందరు శుభసూచకంగా భావిస్తుంటారు. అయితే పవిత్రమైన దసరా పండుగ వేళ మూగజీవి అయిన పాలపిట్టను బందీగా చూడటం బాధాకరమైన విషయం. ఆచారం తప్పకూడదనే ఉద్దేశంతో కొందరు పంజరాల్లో ఉన్నవాటిని లేదా జూ పార్కులకు వెళ్లి చూస్తున్నారు. అయితే ఈసారి పాలపిట్టలను పంజరాల్లో బంధించి ప్రదర్శనకు పెడితే కఠిన చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని అటవీశాఖ అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
మంచి ఆచారం కాస్తా మూర్ఖత్వంగా మారడంతో పాపం పాలపిట్ట బందీగా మారాల్సిన దుస్థితి ఏర్పడింది. జీవితంలో విజయాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ దసరా రోజున పాలపిట్ట దర్శనం తప్పనిసరి అని భావిస్తున్నారు. ఈ క్రమంలో సహజసిద్ధంగా పాలపిట్టలు కంటికి కనిపించకపోవడంతో, వాటి దర్శనం కోసం భక్తులు ఆరాటంతో పరుగులు తీస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
