యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు నేషనల్ రికగ్నిషన్.. దేనికో తెలుసా?

Yadagiri Lakshmi Narasimha Swamy Temple: ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు మరో అరుదైన గుర్తింపు దక్కింది. భక్తులకు అందిస్తున్న డిజిటల్ సేవలతో ఈ దేవస్థానం కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డుల రేసులో నిలిచింది.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు నేషనల్ రికగ్నిషన్.. దేనికో తెలుసా?
Yadagiri Temple

Edited By:

Updated on: May 16, 2026 | 8:54 AM

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. యాదగిరిగుట్ట దేవస్థానం అందిస్తున్న సేవలను ఇప్పటికే ప్రపంచ నేతలు, ఆధ్యాత్మిక వేత్తలు ప్రసంశించారు. తాజాగా యాదగిరిగుట్ట దేవస్థానం భక్తులకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ ఈ- గవర్నెన్స్ అవార్డు రేసులో యాదగిరిగుట్ట దేవస్థానం నిలిచింది.

మహిమాన్విత స్వయంభు యాదగిరిగుట్ట

లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొట్లాది రూపాయలతో పునర్నిర్మాణం జరిగింది. దీంతో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. ముఖ్యంగా సెలవు దినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటోంది. దీంతో యాదగిరిగుట్ట దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు సేవలను సరికొత్తగా అందుబాటులోకి తీసుకు వస్తోంది. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు డిజిటల్ సేవలు కూడా దేవస్థానం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 29వ జాతీయ ఈ- గవర్నెన్స్ అవార్డు ఎంపిక ప్రక్రియలో భాగంగా న్యూఢిల్లీలో శుక్రవారం సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆలయ ఈవో భవాని శంకర్.. ఆలయంలో భక్తులకు అందిస్తున్న డిజిటల్ సేవలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు.

802 దరఖాస్తులు వస్తే..

యాదగిరిగుట్ట దేవస్థానానికి భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ఆలయ అధికారులు.. డిజిటల్ సేవను చేరువ చేసేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. డిజిటల్ సేవలు అందించే సంస్థలకు ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం ఈ గవర్నెన్స్ అవార్డును ఇస్తుంది. ఈ అవార్డు కోసం దేశవ్యాప్తంగా 802 దరఖాస్తులు వివిధ విభాగాల నుండి అందాయి. దీంతో నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ- గవర్నెన్స్ అధికారులు ఇటీవల యాదగిరి క్షేత్రాన్ని సందర్శించారు. దేవస్థానంలో ఎలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయనే అంశాలపై అధ్యయనం చేశారు. భక్తులకు అందుతున్న డిజిటల్ సేవలను పరిశీలించి, సేవలతో భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

జాతీయ స్థాయి ఈ-గవర్నెన్స్ 29వ సదస్సులో భాగంగా మొదటి దశలో వచ్చిన 802 దరఖాస్తుల్లో.. 32 ప్రాజెక్టులతో షార్ట్ లిస్టు తయారు చేశారు. లిస్టులో తెలంగాణ నుంచి యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఉండటం విశేషం. ఢిల్లీలో జరిగిన జ్యూరీ సమక్షంలో ఆలయ ఈవో బృందం ఫైనల్ ప్రజెంటేషన్ సమర్పించింది. జాతీయ స్థాయిలో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మరో మారు గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు.

గతంలో యాదాద్రి ఆలయానికి ప్రసాదాల తయారీ నాణ్యతపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి భోగ్ సర్టిఫికేట్ గుర్తింపు లభించింది. యాదగిరిగుట్ట దేవస్థానం అందిస్తున్న సేవలను కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ కూడా అభినందించారు. ఆలయ పర్యావరణ పరిరక్షణ, సుస్థిర నిర్మాణానికి గానూ ‘అధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రం’ అవార్డును పొందింది.అత్యంత పర్యావరణ అనుకూలమైన, ఆధునీకరించబడిన ఆలయంగా ఐజీబీసీ ద్వారా ఈ ఆలయానికి ప్లాటినం రేటింగ్ దక్కింది.

Follow Us