
ఆదివారం వచ్చిందంటే చాలు.. ముక్క లేనిదే ముద్ద దిగని నాన్‌వెజ్ ప్రియులకు చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో చికెన్ ధర రూ.340 నుండి రూ.360 మధ్య పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో స్కిన్ లెస్ చికెన్ ధర రికార్డు స్థాయికి చేరడంతో సామాన్యులు చికెన్ సెంటర్ల వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు.
చికెన్ ధరలు ఇలా అమాంతం పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయని పౌల్ట్రీ వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కోళ్ల మరణాల సంఖ్య పెరిగింది. ఎండల వేడికి కోళ్లు బరువు తగ్గడం, సకాలంలో పెరగకపోవడంతో మార్కెట్‌కు సరఫరా గరిష్టంగా పడిపోయింది. కోళ్ల మేత ధరలు పెరగడం, రవాణా ఖర్చులు భారం కావడంతో ఆ ప్రభావం నేరుగా వినియోగదారుడిపై పడుతోంది. శుభకార్యాల సీజన్ కావడంతో పాటు మార్కెట్‌కు వచ్చే కోళ్ల సంఖ్య తగ్గడం వల్ల డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేక ధరలు భగ్గుమంటున్నాయి.
చికెన్ ధరలతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. గతంలో రూ.5గా ఉన్న గుడ్డు ధర ఇప్పుడు పలు ప్రాంతాల్లో రూ. 7 నుండి రూ.8 వరకు విక్రయిస్తున్నారు. పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల వల్ల ఈ పెరిగిన ధరలు మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.