
ప్రస్తుత సీజన్‌లో పత్తి పంటను సాగు చేస్తున్న రైతులను తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఆకులు ఎర్రబడటం ఒకటి. పంట ఎదుగుదల దశలో ఆకులు ఎర్రగా మారి రాలిపోవడం వల్ల దిగుబడి దారుణంగా పడిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనిని అరికట్టడానికి తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు తప్పక తెలుసుకోవాలి.
మెగ్నీషియం లోపం: నేలలో మెగ్నీషియం లోపించడం వల్ల ఆకుల ఈనెలు పచ్చగా ఉండి, ఈనెల మధ్య భాగం ఎరుపు లేదా ఊదా రంగులోకి మారుతుంది.
నత్రజని లోపం: మొక్కకు కావలసిన నత్రజని అందకపోతే పాత ఆకులు పసుపు రంగులోకి మారి, ఆ తర్వాత ఎర్రబడతాయి.
రసం పీల్చే పురుగులు: తామర పురుగులు, పేనుబంక, పచ్చదోమ వంటి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు ముడుచుకుపోయి ఎర్రగా మారతాయి.
వాతావరణ మార్పులు: రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గడం, పగటిపూట ఎక్కువ ఉష్ణోగ్రత ఉండటం లేదా నీటి ఎద్దడి వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.
మెగ్నీషియం సల్ఫేట్ స్ప్రే: లీటరు నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్, 10 గ్రాముల యూరియా కలిపి పిచికారీ చేయాలి.
ఎన్‌పికి పిచికారీ: మొక్కకు తక్షణ శక్తి అందడానికి 19:19:19 లేదా 13:0:45 (పొటాషియం సల్ఫేట్) ఎరువును లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి ఆకులపై పిచికారీ చేయాలి.
సమయం: తీవ్రత ఎక్కువగా ఉంటే మొదటి స్ప్రే చేసిన వారం నుండి 10 రోజుల వ్యవధిలో రెండోసారి కూడా పిచికారీ చేసుకోవాలి.
నీటి యజమాన్యం: చేనులో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. తేమ తగినంత ఉండేలా తడులు ఇవ్వాలి.
రసం పీల్చే పురుగుల నివారణ: పురుగుల ఉధృతిని బట్టి ఫ్లోనికామిడ్ (0.3 గ్రా/లీ) లేదా ఎసిఫేట్ (1.5 గ్రా/లీ) లేదా ఇమిడాక్లోప్రిడ్ (0.3 మి.లీ/లీ) చొప్పున నీటిలో కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిసేలా పిచికారీ చేయాలి.
పత్తి రైతులు పంటను ప్రతిరోజూ గమనిస్తూ, ప్రారంభ దశలోనే ఈ పోషకాల లోపాన్ని గుర్తించి సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆకులు ఎర్రబడే సమస్య నుండి పంటను కాపాడుకుని మంచి దిగుబడులు సాధించవచ్చు.