New Ration Card: పెళ్లి కానివారికి స్పెషల్ రేషన్ కార్డ్! ఎలా పొందాలి? అర్హతలు ఏంటంటే..?
ప్రత్యేక రేషన్ కార్డు అందరికీ లభించదు. వివాహం, వేరు కాపురం, ఉద్యోగం కోసం వేరే నగరంలో స్థిర నివాసం వంటి కొన్ని పరిస్థితుల్లో మాత్రమే కొత్త రేషన్ కార్డు పొందే అవకాశం ఉంటుంది. అర్హతలు, అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానంపై పూర్తి వివరాలు తెలుసుకుందాం..

రేషన్ కార్డు పేద, సామాన్య ప్రజలకు అత్యంత కీలకమైన ప్రభుత్వ పత్రాల్లో ఒకటి. ఇది కేవలం ప్రభుత్వ చౌక దుకాణాల్లో ఉచిత బియ్యం పొందేందుకు మాత్రమే కాదు, గుర్తింపు, చిరునామా రుజువుగా కూడా ఉపయోగపడుతుంది. సాధారణంగా కుటుంబానికి ఒక రేషన్ కార్డు జారీ చేస్తారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు విడిగా కూడా కొత్త రేషన్ కార్డు పొందే అవకాశం ఉంటుంది.
ప్రత్యేక రేషన్ కార్డు ఎవరికి లభిస్తుంది?
వివాహం తర్వాత.. వివాహం జరిగిన తర్వాత మహిళ తన తల్లిదండ్రుల రేషన్ కార్డు నుంచి పేరు తొలగించుకుని, భర్త కుటుంబ రేషన్ కార్డులో చేరవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో కొత్త కుటుంబంగా ప్రత్యేక రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
వేరు కాపురం ఉంటే.. ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ వంటగది, ఖర్చులు, జీవన విధానం పూర్తిగా వేరుగా ఉంటే, భార్యాభర్తలు తమ పిల్లలతో కలిసి ప్రత్యేక కుటుంబంగా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధిత అధికారులు భౌతికంగా తనిఖీ చేసి అర్హతను నిర్ధారిస్తారు.
వేరే నగరంలో శాశ్వత నివాసం.. ఉద్యోగం లేదా ఇతర కారణాలతో వేరే నగరానికి వెళ్లి అక్కడే శాశ్వతంగా నివసిస్తుంటే, పాత రేషన్ కార్డు నుంచి పేరు తొలగించుకుని కొత్త చిరునామాతో కొత్త రేషన్ కార్డు పొందవచ్చు.
పెళ్లికాని వారికి అవకాశం ఉందా?.. అవును. అయితే కొన్ని షరతులు ఉంటాయి. అవివాహితుడైనా లేదా అవివాహితురాలైనా స్వతంత్రంగా జీవనం సాగిస్తూ ఉండాలి. కనీసం ఒక సంవత్సరం నుంచి అదే చిరునామాలో నివసించి ఉండాలి. ప్రత్యేక వంటగది నిర్వహిస్తూ ఉండాలి. అయితే తల్లిదండ్రులతో కలిసి ఒకే ఇంట్లో, ఒకే వంటగదిని ఉపయోగిస్తూ ఉంటే ప్రత్యేక రేషన్ కార్డుకు అర్హత ఉండదు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ప్రత్యేక రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసే ముందు పాత రేషన్ కార్డు నుంచి పేరు తొలగించి సరెండర్ సర్టిఫికేట్ లేదా రద్దు ధ్రువీకరణ పత్రం పొందాలి. అనంతరం సంబంధిత రాష్ట్ర ఆహార శాఖ అధికారిక పోర్టల్‌లో లేదా మీ-సేవ/సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
అవసరమైన పత్రాలు
- ఆధార్ కార్డు
- చిరునామా రుజువు
- ఆదాయ ధ్రువీకరణ పత్రం (రాష్ట్ర నిబంధనల ప్రకారం)
- పాత రేషన్ కార్డు రద్దు లేదా సరెండర్ సర్టిఫికేట్
- కుటుంబ వివరాలు, అవసరమైన ఇతర పత్రాలు
దరఖాస్తు అనంతరం ఆహార శాఖ అధికారులు ఇంటికి వచ్చి భౌతిక తనిఖీ నిర్వహిస్తారు. అర్హత నిర్ధారణ తర్వాత కొత్త రేషన్ కార్డు జారీ చేస్తారు. అయితే రేషన్ కార్డు జారీ నిబంధనలు రాష్ట్రానికో రాష్ట్రం భిన్నంగా ఉండవచ్చు. అందువల్ల మీరు నివసిస్తున్న రాష్ట్ర ఆహార శాఖ మార్గదర్శకాలను తప్పనిసరిగా పరిశీలించడం మంచిది.
