
పెళ్ళై వారం రోజులు తిరగక ముందే నవవరుడు అతని తండ్రి ప్రాణాలు కోల్పోయిన సంఘటన హనుమకొండ జిల్లాలో విషాదాన్ని నింపింది.. పెళ్లి వేడుక సందర్భంగా ఇంటికి అలంకరించిన విద్యుత్ దీపాల వైర్లు తగిలి వరుడి తండ్రి విద్యుత్ షాక్ కు గురయ్యాడు. తండ్రిని కాపాడే ప్రయత్నంలో నవవరుడు కూడా నిండు ప్రాణాలు కోల్పోయాడు.. కాళ్ల పారాణి ఆరకముందే వారిని మృత్యువు వెంటాడింది. ఈ విషాద సంఘటన హనుమకొండ లోని భీమారంలో జరిగింది.. సాంబయ్య – రమాదేవి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు.. చిన్న కొడుకు శరత్ కుమార్ హైదరాబాదులో సిఏగా విధులు నిర్వహిస్తున్నాడు.. ఇతనికి జూన్ 24వ తేదీన వివాహం జరిగింది.
పెళ్లి వేడుక సందర్భంగా ఇంటికి లైటింగ్ అమర్చారు. మంగళవారం రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో వరుడి తండ్రి సాంబయ్య ఇంటిపైకి వెళ్లి అకస్మాత్తుగా విద్యుత్ లైట్లు తాకాడు.. ఈ క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై అక్కడే పడిపోయాడు.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో వరుడు శరత్ కుమార్ కూడా విద్యుత్ షాక్ కు గురయ్యాడు..
ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.. ఇద్దరి డెడ్ బాడీలను ఎంజీఎం ఆసుపత్రి మార్చడానికి తరలించారు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..
పెళ్లయి వారం రోజులు కూడా గడవకముందే నవవరుడు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది.. నవవధువు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ఈ ఘటనతో బీమారంలో తీవ్ర విషాదం నెలకొంది.