
వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. సోమన్‌గుర్తి గ్రామ సమీపంలో మాటుగూడెం గ్రామానికి చెందిన మమత (26) తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో తల్లి మమతతో పాటు నాలుగేళ్ల కుమార్తె జనశ్రీ మృతి చెందగా.. ఎనిమిదేళ్ల కుమారుడు సాకేత్ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు.
సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక గజ ఈతగాళ్లు బావిలో గాలింపు చర్యలు చేపట్టారు. తొలుత మమత, జనశ్రీ మృతదేహాలు లభ్యమయ్యాయి. అనంతరం సాకేత్ కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగించారు. ఎట్టకేలకు గజ ఈతగాళ్లు సాకేత్ మృతదేహాన్ని కూడా వెలికితీశారు.
మాటుగూడెం గ్రామానికి చెందిన మమత.. తన పుట్టింటి గ్రామమైన నారాయణపూర్‌కు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. అయితే సోమన్‌గుర్తి గ్రామ సమీపంలో పిల్లలతో కలిసి బావిలో దూకినట్లు వెల్లడించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే పూర్తి కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పరిగి సీఐ కొండల్‌రెడ్డి తెలిపారు. మమత, జనశ్రీ, సాకేత్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..