ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.. చుట్టూ పదుల సంఖ్యలో సెక్యూరిటీ.. జనంలోకి రావాలంటే ఆలోచిస్తారు. అలాంటిది.. శుక్రవారం(అక్టోబర్) సాయంత్రం అనుకోకుండా హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని నీలోఫర్ కేప్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యక్షం అయ్యారు. ఒక్కసారిగా కేంద్ర మంత్రి కేఫ్‌లో కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. అక్కడున్న వారందరితో చెలాకీగా మాట్లాడుతూ సరదా గడిపారు.
ఉదయం నుండి సాయంత్రం వరకు బీజేపీ ఆధ్వర్యంలో మూసీ బాధితుల పక్షాన ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసిన అనంతరం ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు లంకల దీపక్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు యాదవ్ లతో కలిసి నీలోఫర్ కేఫ్ కు వచ్చారు బండి సంజయ్. సాదాసీదాగా కేఫ్ లోకి వెళ్లి కూర్చుని “మస్కా బన్ ” ఆరగించడంతోపాటు చాయ్ తాగారు. బండి సంజయ్ వచ్చారని తెలుసుకున్న నీలోఫర్ కేఫ్ యజమాని బాబూరావు అక్కడికి వచ్చి పరిచయం చేసుకున్నారు.
నీలోఫర్ చాయ్, మస్కా బన్ తనకు ఇష్టమని కేంద్ర మంత్రి చెప్పడంతో.. తాము ఈ మధ్య చిట్టిముత్యాలతో తయారు చేసిన సాంబార్ రైస్‌ను కస్టమర్లకు అందిస్తున్నామని చెప్పిన బాబూరావు వెంటనే సాంబార్ రైస్ తెప్పించి తినాలని బండి సంజయ్‌ను కోరారు. సాంబార్ రైస్ చాలా బాగుందని కితాబు ఇచ్చిన కేంద్ర మంత్రి ఈ కేప్‌కు నీలోఫర్ అని పెట్టడానికి కారణమేంటని అడిగి తెలుసుకున్నారు. తానూ చాలా పేదరికం నుండి వచ్చి.. 1976లో నీలోఫర్ ఆసుపత్రి వద్ద 2 రూపాయలకు చిన్న ఉద్యోగం చేశానని కేంద్రమంత్రికి వివరించారు బాబూరావు. అక్కడే టీ, బిస్కట్లు అమ్మి.. వాటికి గిరాకీ ఉండటంతో కేఫ్ స్థాపించానన్నారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నీలోఫర్ పుణ్యమే అన్నారు. అందుకే తన వ్యాపారానికి ఆ పేరే పెట్టిన. నీలోఫర్ ఆసుపత్రికి వచ్చే రోగులకు, వారి కుటుంబాలకు ఉచిత భోజనం పెట్టి రుణం తీర్చుకుంటున్నా అని వివరించారు. ఈ సందర్భంగా బాబూరావు చేస్తున్న సేవలను బండి సంజయ్ ప్రత్యేకంగా అభినందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..