హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు బండా ప్రకాశ్ డిమాండ్ చేశారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని, ఓ రహదారికి ఆయన పేరును పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాజ్యసభలో రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఎంపీ బండా ప్రకాశ్ మాట్లాడారు.
విభజన చట్టం హామీలను నెరవేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో టీకా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. తెలంగాణకు ఐఐఎం, ఐటీఐఆర్ ప్రాజెక్టు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌ను మంజూరు చేయాలని ఎంపీ బండా ప్రకాశ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం ప్రకటించిన మెగా టెక్స్‌టైల్స్ స్కీంలో వరంగల్‌లో నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కును చేర్చాలన్నారు. ఈ పార్కు నిర్మాణం కోసం బడ్జెట్‌లో రాష్ర్టం రూ. 300 కోట్లు కేటాయించిందని తెలిపారు. రైతులకు సాగుకు అవసరమైన వసతులు కల్పిస్తున్నామని వివరించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా కూడా కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
Also Read: