Hyderabad: మహిళ ప్రాణం తీసిన లిఫ్ట్.. పిల్లలతో ఎక్కేటప్పుడు జాగ్రత్త..
హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదం వెలుగుచూసింది. ఖైరతాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ గుంతలో పడిపోయి ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో ఏడాది బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ జూన్ 06 : లిఫ్ట్‌లో నుంచి కిందపడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ నగరంలో తీవ్ర కలకలం రేపింది వివరాల్లోకి వెళ్తే.. ఖైరతాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో రాధిక అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఈ రోజు ఉదయం ఏడాది వయసున్న తన మనవడిని(బాలుడిని) తీసుకుని కిందకు వెళ్లేందుకు ఇంట్లో నుంచి బయలుదేరింది. లిఫ్ట్ ద్వారా వెళ్దామని అక్కడికి చేరుకున్న ఆమె, బటన్ నొక్కకుండానే లిఫ్ట్‌కు ఉన్న గ్రిల్‌ను బలంగా లాగింది. సాంకేతిక లోపం లేదా మరేదైనా కారణం వల్ల లిఫ్ట్ రాకపోయినా గ్రిల్ తెరుచుకుంది.
అయితే లిఫ్ట్ వచ్చిందనే భ్రమలో రాధిక తన మనవడితో కలిసి లోపలికి అడుగుపెట్టింది. అక్కడ లిఫ్ట్ కేబిన్ లేకపోవడంతో పై అంతస్తు నుండి నేరుగా కింద పడిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె చేతిలో ఉన్న ఏడాది బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. చిన్నారి ఏడుపు విన్న అపార్ట్‌మెంట్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై, పోలీసులకు మరియు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
