నర్సే డాక్టరు.. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం తర్వాత ఘోరం! కన్నీళ్లు పెట్టించే ఘటన

జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం, ఆక్సిజన్ కొరత ఒక పసికందు ప్రాణాలు తీశాయి. పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సు డెలివరీ చేసింది. ఆ తర్వాత శిశువుకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడంతో పసిప్రాణం గాల్లో కలిసింది.

నర్సే డాక్టరు.. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం తర్వాత ఘోరం! కన్నీళ్లు పెట్టించే ఘటన
Zaheerabad Hospital

Edited By:

Updated on: Jul 06, 2026 | 1:00 PM

వైద్యో నారాయణో హరి.. ప్రాణాలు కాపాడే డాక్టర్లను దేవుడితో సమానంగా చూస్తారు. కానీ జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. సిబ్బంది నిర్లక్ష్యం, పాలకుల పట్టింపు లేనితనం ఒక పసిప్రాణాన్ని గాల్లో కలిపేసింది. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన ఒక పేద గర్భిణికి నరకం చూపించారు ఇక్కడి సిబ్బంది. అత్యవసర సమయంలో కాపాడాల్సిన డాక్టర్ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో, అక్కడి నర్సు డాక్టర్ అవతారమెత్తారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పొట్టిపల్లి గ్రామానికి చెందిన మనోహర అనే గర్భవతి కాన్పు కోసం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో మనోహర అనే మహిళలకు నర్సు, ఆయా కలిసి డెలివరీ చేశారు. ప్రసవం తర్వాత పసికందుకు ఊపిరి అందడంలో ఇబ్బంది ఏర్పడింది. అదే సమయంలో ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది. చూస్తుండగానే పాపం ఆ పసికందు ఊపిరి అందగా విలవిల్లాడు మరణించింది.

వైద్యుల నిర్లక్ష్యం, కనీస సౌకర్యాల లేమి ఒక పసిప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే ఈ మృతికి కారణమంటూ బాధితులు ఆందోళనకు దిగారు. నిబంధనల ప్రకారం కాన్పు సమయంలో గైనకాలజిస్ట్ లేదాడ్యూటీ డాక్టర్ ఉండాలి. కానీ, ఆసుపత్రిలో డాక్టర్లు లేకపోవడంతో నర్సు, ఆయా కలిసి గర్భిణికి డెలివరీ చేశారు. డెలివరీ అయితే సక్సెస్ అయింది కానీ.. పుట్టిన కాసేపటికే ఆ పసికందు పరిస్థితి విషమంగా మారింది. ఊపిరి తీసుకోవడానికి శిశువు తీవ్రంగా నరకయాతన పడింది. తాను నొప్పులతో వస్తే ఆస్పత్రిలో ఒక్క డాక్టర్ కూడా లేడు అని, నర్సు, ఆయా కలిసి లోపలికి తీసుకెళ్లి డెలివరీ చేశారని, బాబు పుట్టాక శ్వాస ఆడట్లేదు, ఆక్సిజన్ పెట్టమంటే ఆస్పత్రిలో సిలిండర్ లేదన్నారని, తమ కళ్లముందే నా బిడ్డ కొట్టుకుంటూ చనిపోయాడని ఈ పాపం అంతా ఈ ఆస్పత్రి సిబ్బందిదే అంటూ ఆ తల్లి తల్లడిల్లిపోయింది.

డాక్టర్ టైమ్‌కి ఉండి, ఆక్సిజన్ ఉంటే బిడ్డ బతికేవాడు అని మనోహర బంధువులు ఆసుపత్రి సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లముందే పసికందు ప్రాణాలు పోవడంతో తల్లిదండ్రులు, బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందాడంటూ హాస్పిటల్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం అత్యవసర సేవలకైనా ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us