
అతివేగం ప్రమాదం అని ఎంత మొత్తుకుంటున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. తాజాగా అదే అతివేగానికి మరో ఐదుగురు బలయ్యారు. వాయువేగంతో వచ్చిన ఓ స్పోర్ట్స్ బైక్ యూటర్న్ తీసుకుంటున్న ఓ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులతో పాటు మొత్తం ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులుకు ప్రమాద తీవ్రత దృశ్యాలు షాకిచ్చాయి. రెండు పెద్ద వాహనాలు ఢీకొన్న రేంజ్‌లో కారు, బైక్ నుజ్జునుజ్జు అవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వాహనాలు ద్వంసమై నతీరును చేస్తేనే అర్థమవుతుంది కారును స్పోర్ట్స్ బైక్ ఏ రేంజ్‌లో ఢీకొట్టిందో అని.
ఇక మృతదేహాలను స్వాదీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బైక్ రేసింగ్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ నుంచి స్పోర్ట్స్ బైక్స్‌తో 11మంది మహబూబ్‌నగర్‌లోని ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారని.. అక్కడినుంచి తిరిగి వెళ్లే క్రమంలో రేసింగ్ నిర్వహించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదానికి ముందు స్పోర్ట్స్ బైక్స్‌కు సంబంధించిన వీడియో బయటకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలో ముందు వరసలోనున్న బైక్ ప్రమాదానికి గురైందని.. వెనుక నడుచుకుంటూ వస్తున్న వ్యక్తి కూడా ఇదే బైక్‌పై ప్రయాణించినట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే.. మహబూబ్‌నగర్ పాలకొండ చౌరస్తాలో యూటర్న్ తీసుకుంటున్న కారును రేసింగ్ స్పోర్ట్స్ బైక్ అతివేగంతో బలంగా కారును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. బైక్‌పైన ఉన్న ఇద్దరు.. కారులోని ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.