
శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలకు భోజనాలు వండేవారు ఎక్కడైనా గ్రామానికి ఒకరిద్దరు ఉంటారు. కానీ, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్‌లో మాత్రం ఏ ఇంటా చూసిన వాళ్లే కనిపిస్తారు. ఏ కార్యమమైనా వంటలు వండాలంటే ఈ ఊరి వంట మనుషులదే మొదటి ఎంపిక. గ్రామ జనాభా 2,200 కాగా, వంట చేసేవారు పాతికమంది పైగా ఉన్నారు. మరోవైపు సమీపంలోని తిమ్మాపూర్ తండాలో నలుగురికి పైగా పాకశాస్త్ర ప్రావీణ్యులున్నారు.
గ్రామానికి చెందిన రాజేశుని నారాయణ 60 ఏళ్ల క్రితం ఓ దొర దగ్గర వంటలు చేసేవారు. రుచికరంగా చేయడంతో చుట్టు పక్కల గ్రామాల్లో గుర్తింపు వచ్చింది. ఆర్డర్లు అధికంగా రావడంతో నారాయణ తనకు సహాయంగా అయిదుగురు సోదరులను వెంట తీసుకెళ్లేవారు.అలా కుటుంబం మొత్తం వంటల తయారీలో ఆరితేరారు. గ్రామానికి చెందిన ఒకరిద్దరు పాకశాస్త్రంలో ప్రసిద్ధి చెందడంతో ప్రముఖ రాజకీయ నాయకుల ఇళ్లలో జరిగే కార్యక్రమాల్లో, అలాగే పార్టీ సమావేశాల్లో భోజనాలు తయారు చేశారు.
వీరి దగ్గర పలువురు నేర్చుకోవడంతో గ్రామంతో పాటు తండాలో సుమారు 25 మందికిపైగా వంట చేసేవారు ఉన్నారు. పరోక్షంగా వంద మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఇందులో ప్రణీత్ గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా మాంసాహార, శాఖాహార వంటకాలను వండి వడ్డించారు. వీరు చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ తోపాటు మహారాష్ట్రలో జరిగే శుభకార్యాలకు వంటలకు వెళుతుంటారు. క్వింటాలుకు రూ.5వేల నుంచి రూ.7వేలు వరకు వసూలు చేస్తుంటారు. సీజన్‌లో వంటలు చేస్తూ మిగతా సమయంలో పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఈ నల భీములు..!
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..