
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇటీవల తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. దీంతో పల్లెల్లో ఎన్నికల సందడి కొనసాగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఎక్కువమంది గెలివగా.. తర్వాతి స్ధానంలో బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సర్పంచ్‌లు ఉన్నారు. ఇక మూడో స్థానంలో బీజేపీ నిలిచింది. ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో.. తెలంగాణలో మరో స్ధానిక సంస్థల ఎన్నికల సమరానికి రంగం సిద్దమైంది. రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమవుతోంది.
ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కొర్పొరేషన్లలో ఓటర్ల సవరణ జాబితా సిద్దం చేయాలని ఈసీ నిర్ణయించింది. డిసెంబర్ 30వ తేదీ నుంచి ఓటర్ల లిస్ట్ సవరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది జనవరి 10లోపు పూర్తి చేయనుంది. జనవరి 1న ఓటర్ల జాబితా మసాయిదాను విడుదల చేయనున్నారు. ఈ లిస్ట్‌కు సంబంధించి ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత జనవరి 10న తుది జాబితా విడుదల చేస్తారు. దీని ఆధారంగా ఎన్నికలను నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్, మంచిర్యాల, నిజామబాబాద్, కొత్తగూడెం, మహబూబ్ నగర్, రామగుండం కార్పొరేషనన్లకు ఎన్నికలు జరగనున్నాయి.
జనవరిలో ఓటర్ల జాబితా సిద్దం కానుండగా.. ఫిబ్రవరిలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికలు జరిగే అవకాముందని తెలుస్తోంది. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కూడా అదే నెలలో జరిపే ఛాన్స్ ఉంది. దీంతో ఫిబ్రవరిలో తెలంగాణలో మరో స్ధానిక సంస్థల ఎన్నికల కోలాహలం ప్రారంభం కానుంది. ఇటీవల సర్పంచ్ ఎన్నికలు ముగియగా.. కొత్త సర్పంచ్‌లు ప్రమాణస్వీకారం చేశారు.