TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. మళ్లీ రోడ్డెక్కిన బస్సులు..

టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. జేబీఎం సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల సాంకేతిక కారణాలతో ఈ బస్సులను సస్పెండ్ చేశారు. ఇప్పుడు తనిఖీలు అనంతరం తిరిగి తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులకు ఊరట కలిగింది. మరిన్ని వివరాలు చూస్తే..

TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. మళ్లీ రోడ్డెక్కిన బస్సులు..
Tgsrtc

Updated on: Jul 08, 2026 | 8:42 PM

తెలంగాణలోని ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్. బ్యాటరీ లోపాలతో ఆగిపోయిన జేబీఎం సంస్ధకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులు రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ రోడ్డెక్కాయి. ఈ సంస్థకు చెందిన బస్సుల్లో తరచూ బ్యాటరీ లోపాలు బయటపడటం, అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటుండటంతో టీజీఎస్ఆర్టీసీ ఇటీవల ఈ బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ ఆ బస్సులు రోడ్డెక్కాయి. దాదాపు వారం రోజుల పాటు ఈ బస్సులు ఆగిపోయాయి. దీంతో డిపోలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇప్పుడు మళ్లీ రోడ్డెక్కడంతో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. విడతల వారీగా ఈ బస్సులను ఆర్టీసీ పునరుద్దరిస్తోంది. అందులో భాగంగా బుధవారం మరో 118 జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులకు క్లియరెన్స్ ఇచ్చింది.

అందుబాటులోకి 268 బస్సులు

ఆర్టీసీ సాంకేతిక విభాగం తాజాగా 118 జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులకు క్లియరెన్స్ ఇచ్చింది. భద్రతా తనిఖీలు, సాంకేతిక పరిశీలన అనంతరం ఈ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు మొత్తం 268 బస్సులను పున:ప్రారంభించారు. టీజీఎస్ఆర్టీసీ మొత్తం 500 జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులను వివిధ రూట్లలో నడుపుతోంది. ఈ బస్సుల్లో మంటలు చెలరేగిన ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రయాణికుల భద్రత కారణంగా జులై 2వ తేదీ నుంచి నిలిపివేశారు. తాత్కాలికంగా ఈ బస్సులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బస్సులను తనిఖీ చేయడం ప్రారంభించింది. కఠినతరమైన పరీక్షలు, తనిఖీలు అనంతరం తిరిగి సర్వీసులను ప్రారంభించింది. తొలి విడతలో 150 బస్సులను ప్రారంభించగా.. ఇప్పుడు 118 బస్సులను పునరుద్దరించింది. ఇప్పటివరకు మొత్తం 268 బస్సు సర్వీసులను ప్రారంభించింది. రాబోయే మూడు రోజుల్లో మిగతా బస్సులను తిరిగి ప్రారంభించే అవకాశముంది.

Follow Us