
Free Bus Journey: తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు కోట్ల మంది మహిళలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోగా.. తరచూ లక్షల మంది మహిళలు ఫ్రీగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డులను చూపిస్తే కండక్టర్లు జీరో టికెట్ అందిస్తున్నారు. ఈ టికెట్ సహాయంతో మహిళలు ఉచితంగా ఎక్కడివరకైనా వెళ్తున్నారు. దీని వల్ల బస్సుల్లో మహిళల రద్దీ ఎక్కువగా పెరగ్గా.. దానికి తగ్గ సంఖ్యలో బస్సులు అందుబాటులోకి లేవు. దీంతో పరుషులకు చోటివ్వకుండా బస్సు చివరి సీట్లలో కూడా మహిళలు కూర్చుంటున్నారు. ఈ కారణంతో మహిళలు, కండక్టర్ల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో దీనిపై తెలంగాణ ఆర్టీసీ స్పందించింది.
పురుషులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక సీట్లు ఏమీ లేవని, అలాంటి నిబంధనలు కూడా ప్రస్తుతం విధించలేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్సుల్లో మహిళలకు 40 శాతం సీట్లు పోనూ మిగతా సీట్లలో ఎవరైనా కూర్చోవచ్చని స్పష్టం చేశారు. మిగతా సీట్లల్లో కూర్చున్న మహిళలను కండక్టర్లు బలవంతంతగా లేపినా లేదా దురుసుగా ప్రవర్తించినా అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు ఎవరైనా ఉచిత బస్సు ప్రయాణంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే 040-69440000 లేదా 040-23450033 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. వెంటనే సిబ్బంది స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. బస్సుల్లో పురుషులకు ప్రత్యేక రిజర్వేషన్ సీట్ల నిబంధన ఏదీ లేదన్నారు. ఉద్దేశపూరంగా మహిళా ప్రయాణికులను ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఆర్టీసీ నిబంధనల ప్రకారం.. బస్సుల్లో ఉన్న సీట్లలో 40 శాతం సీట్లను మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన 60 సీట్లలో మహిళలు, పురుషులు ఎవరైనా కూర్చోవచ్చు. పురుషులకు అంటూ ప్రత్యేక రిజర్వేషన్ ఏమీ లేదు. కొంతమంది కండక్టర్లకు ఈ నిబంధనలు సరిగ్గా తెలియక మహిళా ప్రయాణికులపై నోరు పారేసుకుంటున్నారు. ప్రస్తుతం బస్సుల్లో 75 శాతం వరకు మహిళలే ప్రయాణిస్తుండటంతో తరచూ కండక్టర్లు, మహిళల మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఆర్టీసీ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.