
హైదరాబాద్: తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని మరింత విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌కు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానాలకు రూపకల్పన చేస్తోంది. ప్రస్తుత పారిశ్రామిక విధానానికి దాదాపు పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ‘ఇండస్ట్రియల్ పాలసీ 2.0’ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడం, తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, ఆధునిక సాంకేతికత ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం, పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు సృష్టించడం ఈ కొత్త విధానాల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాలు, టైర్-2, టైర్-3 నగరాలకు పారిశ్రామిక కార్యకలాపాలను విస్తరించడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది.
ఇండస్ట్రియల్ పాలసీ 2.0లో భాగంగా మొత్తం 10 కీలక రంగాలకు ప్రత్యేక విధానాలను రూపొందించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇప్పటికే లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించిన కొత్త విధానం ప్రకటించగా.. మిగిలిన రంగాలపై కసరత్తు కొనసాగుతోంది.
లాజిస్టిక్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫుట్‌వేర్–లెదర్, అప్పెరల్–లైఫ్‌స్టైల్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్, ఆటోమొబైల్ రంగాలు ఇందులో ఉన్నాయి.
కొత్త పారిశ్రామిక విధానాల్లో పెట్టుబడి విలువ ఒక్కటినే ప్రాతిపదికగా తీసుకోకుండా.. ఉద్యోగాల కల్పన, తయారీ సామర్థ్యం, ఎగుమతులు, స్థానికంగా ఏర్పడే విలువ, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
పెద్ద, భారీ, మెగా పరిశ్రమలను రాష్ట్రానికి ఆకర్షించేలా ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు అదనపు ప్రయోజనాలు కల్పించే అంశంపైనా దృష్టి సారించింది.
లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ‘నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30’ను ఇప్పటికే తీసుకొచ్చింది.
2030 నాటికి ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో తెలంగాణను నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వచ్చే ఐదేళ్లలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకుంది.
జీనోమ్ వ్యాలీ విస్తరణతో పాటు మెడికల్ డివైసెస్, గ్రీన్ ఫార్మా, ఫార్మా విలేజీలు, బయో ఇన్నోవేషన్ వంటి విభాగాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
హైదరాబాద్‌లో ఇప్పటికే బలంగా ఉన్న ఐటీ రంగాన్ని తదుపరి దశకు తీసుకెళ్లేందుకు ‘ఐటీ పాలసీ 2.0’ను రూపొందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డీప్‌టెక్, ఫిన్‌టెక్, డిజిటల్ ఇంజినీరింగ్ వంటి రంగాలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
భవిష్యత్‌లో అధిక విలువ కలిగిన టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రపంచ కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయ తయారీ కేంద్రాల కోసం చూస్తున్న నేపథ్యంలో ఆ అవకాశాలను తెలంగాణ వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
సెమీకండక్టర్లు, చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల తయారీ వంటి రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే దిశగా చర్యలు తీసుకోనున్నారు. కేంద్రం చేపట్టిన సెమీకండక్టర్ కార్యక్రమాలతో అనుసంధానం చేసుకుని తెలంగాణను అధునాతన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులను పెంచేందుకు ప్రత్యేక పాలసీని తీసుకురానున్నారు. స్పేస్ స్టార్టప్‌లు, రక్షణ పరికరాల తయారీ, ఏరోస్పేస్ కాంపోనెంట్లు, పరిశోధన సంస్థలకు అనుకూల వాతావరణం కల్పించేలా విధానాన్ని రూపొందిస్తున్నారు. పరిశోధన, పరీక్షలు, తయారీకి అవసరమైన మౌలిక వసతులతో క్లస్టర్లను అభివృద్ధి చేసే అంశం కూడా ఇందులో ఉండనుంది.
పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం ఉన్న ఫుట్‌వేర్, లెదర్, అప్పెరల్, లైఫ్‌స్టైల్ రంగాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీలను రూపొందిస్తున్నారు.
హైదరాబాద్ వెలుపల ఈ పరిశ్రమలను ఏర్పాటు చేయించడం ద్వారా జిల్లాల్లో ఉపాధి అవకాశాలను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముడిసరుకు నుంచి తయారీ, ప్యాకేజింగ్, మార్కెటింగ్, ఎగుమతుల వరకు పూర్తి విలువ గొలుసును రాష్ట్రంలోనే అభివృద్ధి చేయాలని భావిస్తోంది.
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ఇప్పటికే హైదరాబాద్ కీలక కేంద్రంగా ఉంది. ఈ రంగాన్ని మరింత విస్తరించేందుకు ప్రత్యేక జీసీసీ పాలసీని తీసుకురానున్నారు.
ఏఐ, ఇంజినీరింగ్, ఫైనాన్స్, క్లౌడ్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వంటి అధిక నైపుణ్యం అవసరమయ్యే కార్యకలాపాలను హైదరాబాద్‌కు తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఉండనుంది.
ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డేటా సెంటర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు.
డేటా సెంటర్లతో పాటు క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి అనుబంధ రంగాలు కూడా రాష్ట్రంలో విస్తరించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
పరిశ్రమలకు రవాణా వ్యయాన్ని తగ్గించడం, ఉత్పత్తులను వేగంగా మార్కెట్లకు చేరవేయడం, ఎగుమతులను సులభతరం చేయడంలో లాజిస్టిక్స్ రంగం కీలకంగా మారనుంది.
డ్రైపోర్టులు, మల్టీమోడల్ లాజిస్టిక్స్ హబ్‌లు, గిడ్డంగులు, కోల్డ్‌చెయిన్ వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేయడంపై కొత్త పాలసీలో దృష్టి పెట్టనున్నారు.
తెలంగాణలో ఆటోమొబైల్ తయారీ రంగాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని భావిస్తోంది. కార్ల తయారీతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, బ్యాటరీలు, ఆటో కాంపోనెంట్ల తయారీ సంస్థలను ఆకర్షించేలా ప్రోత్సాహకాలు ఇవ్వాలని పరిశీలిస్తోంది.
‘తెలంగాణ రైజింగ్–2047 గ్లోబల్ సమ్మిట్’ను కొత్త పారిశ్రామిక విధానాల ఆవిష్కరణకు వేదికగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఫ్యూచర్ సిటీలో జరిగే ఈ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త విధానాలను ప్రకటించే అవకాశం ఉంది.
పెట్టుబడులు, పరిశ్రమలు, సాంకేతికత, ఉపాధి కల్పనను ఒకే వ్యూహంలోకి తీసుకువచ్చి తెలంగాణను దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయి పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడమే ఇండస్ట్రియల్ పాలసీ 2.0 ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.