
డ్వాక్రా మహిళలకు చేయూత అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కొత్త కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగా మరో ముందడుగు వేసింది. ఇప్పటికే మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌లు, ఆర్టీసీ బస్సులు నడుస్తుండగా.. వారిని ప్రోత్సహించేందుకు మరో ప్రణాళిక రచించింది. అదేంటంటే.. డీమార్ట్ తరహాలోనే రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సూపర్ బజార్లను ఏర్పాటు చేయనుంది. అలాగే లాజిస్టిక్స్ హాబ్, ఆధునిక రైస్ మిల్లలను ఏర్పాటు చేయించేందుకు సిద్దమవుతోంది. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.
మహిళా శక్తి సూపర్ బజార్ల పేరుతో సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేయించనున్నారు. అన్ని జిల్లాల్లో ఒకేసారి కాకుండా విడతల వారీగా వీటిని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. తొలి విడతలో ఉమ్మడి జిల్లా కేంద్రాలైన హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, సంగారెడ్డిలలో ఒక్కొక్కటి చొప్పున నెలకొల్పనున్నారు. డీమార్ట్ తరహాలోనే ఈ సూపర్ బజార్లలో అన్నీ నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయి. అలాగే ఇంట్లోకి అవసరమయ్యే పరికరాలు, వివిధ వస్తువులను తక్కువ ధరకే అందుబాటులో ఉంచనున్నారు. ఖమ్మం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత మిగతా జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. సమర్థవంతంగా పనిచేస్తున్న మహిళా సంఘాలను ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు సెర్ప్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీటి ఏర్పాటు కోసం ప్రభుత్వం స్థలాలు కేటాయించనుంది. జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటిని నెలకొల్పనున్నారు. మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కొత్త కార్యక్రమాలు చేపడుతోంది. వ్యాపారం మొదలుపెట్టాలనుకునే మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా అందిస్తోంది.