
Srinath Reddy Death: తెలంగాణకు చెందిన 25 ఏళ్ల విద్యార్థి ఎస్. శ్రీనాథ్ రెడ్డి లండన్‌లోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత ఏడాది ఉన్నత విద్య కోసం యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లిన శ్రీనాథ్, జూన్ 23న తన గదిలో విగతజీవిగా కనిపించాడు. శ్రీనాథ్ స్వస్థలం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం తలమడ్ల గ్రామం. కుమారుడి ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. అతను ఎలా మృతిచెందాడనే విషయంపై ఇప్పటికీ పూర్తి వివరాలు అందలేదని తండ్రి మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, జూన్ 22 రాత్రి శ్రీనాథ్ లండన్‌లో తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు హాజరయ్యాడు. అదే రాత్రి ఇంటికి ఫోన్ చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడాడని, ఆ సమయంలో అతను చాలా ఉత్సాహంగా, సాధారణంగానే కనిపించాడని తండ్రి తెలిపారు. ఎలాంటి ఆందోళన లేదా అసాధారణ పరిస్థితి ఉన్నట్లు అనిపించలేదని కుటుంబం వెల్లడించింది.
లండన్‌లోనే ఉంటున్న మరో బంధువు కుమారుడి ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం, జూన్ 23 ఉదయం శ్రీనాథ్ గదిలో అతని రూమ్‌మేట్ మృతదేహాన్ని గుర్తించాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం, అతను ఉరివేసుకుని మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.
అయితే, ఈ ఘటన జరిగిన వెంటనే రూమ్‌మేట్ ఇతర స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఆలస్యం కారణంగా శ్రీనాథ్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
శ్రీనాథ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అలాగే, బ్రిటన్ అధికారులతో సమన్వయం చేసి మరణానికి గల అసలు కారణాలను వెలికితీయాలని, కుటుంబానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. శ్రీనాథ్ మృతితో తలమడ్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా, లండన్ పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.