
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యం కోసం మరో కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది తెలంగాణ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ. నాన్‌స్టాప్ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ తీసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు సెల్ఫ్ టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇక బస్సు ఎక్కే సమయంలో కండక్టర్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా.. ప్రయాణికులే తమ టికెట్‌ను స్వయంగా బుక్ చేసుకునే అవకాశం కల్పించనుంది.
ఈ విధానంలో భాగంగా బస్సు డోర్ వద్ద ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌తో ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే టికెట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం ఎక్కడి నుంచి బస్సు ఎక్కుతున్నారో, ఏ స్టాప్‌లో దిగాలనుకుంటున్నారో వివరాలను నమోదు చేయాలి. ఆన్‌లైన్‌లో చెల్లింపు పూర్తిచేసిన వెంటనే టికెట్ జనరేట్ అవుతుంది. బస్సులోకి ఎక్కిన తర్వాత ఆ టికెట్‌ను డ్రైవర్‌కు చూపిస్తే ప్రయాణం కొనసాగించవచ్చు. దీంతో టికెట్ కోసం బస్సు వద్ద సమయం వృథా కాకుండా ప్రయాణికులు త్వరగా తమ గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది.
ఈ సెల్ఫ్ టికెటింగ్ విధానాన్ని మొదటగా నల్గొండ–హైదరాబాద్ మార్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ మార్గంలో సుమారు 45 డీలక్స్ నాన్‌స్టాప్ బస్సులు నడుస్తున్నాయి. ఈ రూట్‌లో కొత్త విధానం ఎలా పనిచేస్తుందో పరిశీలించిన తర్వాత.. ఫలితాలు సంతృప్తికరంగా ఉంటే ఇతర నాన్‌స్టాప్ రూట్లకు కూడా విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే సెప్టెంబర్ నెలాఖరు నాటికి మరిన్ని రూట్లలో సెల్ఫ్ టికెటింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్త విధానం అమలుతో చిల్లర సమస్యకు చెక్ పడటంతో పాటు టికెట్ జారీ చేసే ప్రక్రియలో సమయం కూడా ఆదా అవుతుందని ఆర్టీసీ భావిస్తోంది. ముఖ్యంగా నాన్‌స్టాప్ సర్వీసుల్లో టికెట్ల జారీ బాధ్యత తగ్గడంతో డ్రైవర్లపై ఉండే పనిభారం కూడా కొంత మేర తగ్గే అవకాశం ఉంది.
అయితే ప్రతి ఒక్కరూ డిజిటల్ విధానాన్ని ఉపయోగించగలరనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను తీసుకురావడం లేదు. స్మార్ట్‌ఫోన్ లేని వారు లేదా ఆన్‌లైన్ చెల్లింపులు చేయడం తెలియని ప్రయాణికులు మాత్రం సాధారణ పద్ధతిలో డ్రైవర్ వద్ద టికెట్ తీసుకుని ప్రయాణించవచ్చు.
ఈ సెల్ఫ్ టికెటింగ్ వ్యవస్థను అమలు చేసేందుకు ఆర్టీసీ మై టికెట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ప్రయోగాత్మక దశలో ఎదురయ్యే సమస్యలు, ప్రయాణికుల స్పందనను పరిశీలించిన అనంతరం రాష్ట్రంలోని ఇతర నాన్‌స్టాప్ సర్వీసులకు ఈ విధానాన్ని విస్తరించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.