
తల్లిదండ్రులను దైవాలుగా పూజించాలని భారతీయ సనాతన ధర్మం బోధిస్తున్నది. కానీ, నేటి సమాజంలో వృద్ధులైన తల్లిదండ్రుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వారి ఆస్తులను లాక్కొని బిడ్డలు వారిని ఇంటినుంచి గెంటివేసి రోడ్డుపాలు చేస్తున్నారు.
మరికొంతమందిని వృద్ధాశ్రమాలకు తరిమివేసి వారి బాగోగులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వారు అనారోగ్యం పాలైతే కనీసం వైద్యం చేయించే పరిస్థితి కూడా లేదు. కనీ పెంచి పెద్ద చేసి తమ సర్వస్వాన్ని పిల్లల కోసం దారపోసిన తల్లిదండ్రుల బాగోగులను చూడకుండా నిర్లక్ష్యం వహించడం అత్యంత క్రూరత్వం.
కనుక, పిల్లల చేతిలో అనాదరణకు గురైన వృద్ధుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి దయనీయ స్థితికి చలించి, వారి సంక్షేమం కోసం చర్యలు ప్రారంభించింది.
తల్లిదండ్రులను ఆదరించని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి నెలకు 15 శాతం లేదా రూ.10 వేలు.. వీటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రులకు అందజేసే ‘తెలం గాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ యాక్ట్- 2026’ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది.
జీవితంలో మంచిగా స్థిరపడిన బిడ్డలు కూడా తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తల్లిదండ్రుల భద్రత బిల్లును తెచ్చింది. ఈ బిల్లు పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు ప్రజా ప్రతినిధులను కూడా తీసుకువచ్చారు.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన తల్లి దండ్రులు, వృద్ధుల సంక్షేమం, నిర్వహణ చట్టం-2007 ప్రకారం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలు, నెలకు రూ.10 వేల వరకు తల్లిదండ్రులకు కనీస అవసరాల కింద చెల్లించాలని చెల్లించాలని ఆదేశించే అధికారం ట్రిబ్యునళ్లకు ఉంది. అయితే, ట్రిబ్యునళ్లు అలాంటి ఆదేశాలిచ్చినా.. వాటి అమలు కోసం వృద్ధాప్యంలో అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిల్లును రూపొందించింది.
పిల్లలను తమ వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి వేత నాల నుంచి ప్రతి నెలా 15 శాతం లేదా రూ.10 వేలు. ఇందులో ఏది తక్కువ అయితే ఆ మొత్తం నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాకు మళ్లించే అధికారం ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్రంలోని దాదాపు 10.50 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఈ చట్టం పరిధిలోకి వస్తారు. రాష్ట్రంలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా బిల్లు పరిధిలోకి తెచ్చారు. ప్రజాప్రతినిధులు కూడా దీని పరిధిలోకి వస్తారు.
దంపతులకు కుమారుడు లేకపోతే ఉద్యోగం చేస్తున్న కుమార్తెలు వారిని పోషించాల్సి ఉంటుంది. కుమారుడు మరణిస్తే ఉద్యోగి అయిన కోడలు పోషించాల్సి ఉంటుంది. కోడలు ఉద్యోగి కాని పక్షంలో కుమారుడికి వచ్చే పెన్షన్ నుంచి అత్తమామలకు కొంత ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ చట్టం అమలుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోనుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్లు దీనిని అమలు చేస్తారు. అక్కడ న్యాయం జరగకపోతే రాష్ట్ర స్థాయిలో ఉండే కమిషన్‌కు బాధితులు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ కమిషన్‌కు హైకోర్టు విశ్రాంత న్యాయ మూర్తి చైర్మన్‌గా ఉంటారు. బాధ్యతారహితంగా వ్యహరించే కలెక్టర్లకు సమన్లు జారీచేసే అధికారం కూడా ఈ కమిషన్‌కు ఉంటుంది. ఈ కమిషన్‌కు న్యాయాధికారాలు కూడా కల్పించారు. ఈ చట్టంతో వృద్ధాప్యంలో బాధపడుతున్న తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా చేకూరే అవకాశం ఉంది.