Telangana New Excise Policy: తెలంగాణలో కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఈ మేరకు పాలసీ అమలు తీరుపై రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో సమీక్షా నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎక్సైజ్ నూతన పాలసీ రూపకల్పన తీరుపై చర్చించారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 30 వ తేదీతో బార్ ల లైసెన్సు గడువు ముగుస్తున్న నేపథ్యంలో 2021 -22 సంవత్సరానికి గాను నూతన బార్స్ లైసెన్స్ లకు సంబంధించిన అంశాలపై మంత్రి ప్రధానంగా సమీక్షించారు. వీటితోపాటు ఎ- 4 వైన్ షాపుల లైసెన్సుల గడువు అక్టోబర్ 31వ తేదీతో ముగిస్తున్న నేపథ్యంలో నవంబర్ 1వ తేది నుండి అమల్లోకి వచ్చే నూతన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన విధి విధానాల రూపకల్పనపై చర్చించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా 100కుపైగా మద్యం దుకాణాలకు అనుమతిచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఏ-4 దుకాణాలు 2,216 వరకు ఉండగా.. కొత్త మండలాలకు దుకాణాలు మంజూరు చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుత మద్యం పాలసీ అక్టోబర్ 31తో ముగియనుంది. గత పాలసీలో వైన్స్‌ల లైసెన్స్‌కు నాన్‌రిఫండబుల్ ఫీజు రూ.2 లక్షలు వసూలుచేశారు. అయినా దుకాణాలు దక్కించుకునేందు కు 48 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. కొత్త మద్యం పాలసీలో లైసెన్స్ టెండర్ దరఖాస్తుల నాన్‌రిఫండబుల్ ఫీజు కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రాష్ట్ర ఖజానాను మరింత పెంచుకోవాలని అబ్కారీ శాఖ చూస్తోంది. అయితే, ఎంత పెరుగుతుందన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. అలాగే, ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నీరా ప్రాజెక్టు నిర్మాణ పనులను వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.
Read Also… GOLD ETF: బంగారం కొనడం కన్నా.. ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టడం లాభదాయకం.. ఎలానో తెలుసుకోండి!