Cancellation of leave for Municipal Employees: రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో యుద్ధ ప్రాతిపదికన క్రిమిసంహారక ద్రావకం సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, కమిషనర్ ఎండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌లతో మంత్రి కేటీఆర్ టెలి కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు.
ప్రస్తుతం మున్సిపల్ శాఖ వద్ద ఉన్న వాహనాలతో పాటు అవసరమైన చోట ప్రత్యేకంగా వాహనాలను అద్దెకు తీసుకుని సోడియం హైపోక్లోరేట్ ద్రావకం పిచికారీ చేయాలని మంత్రి చెప్పారు. ఇందుకోసం పట్టణ ప్రగతి నిధులు వినియోగించాలని మంత్రి సూచించారు. కరోనా తీవ్రత కొనసాగుతున్నందున శాఖ పరిధిలో ఉన్న ఎంటమాలజిస్టులు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మున్సిపల్ శాఖ పరిధిలోని ఉద్యోగులు అందరు విధులకు హాజరు కావాలని, సెలవులు రద్దు చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించినట్లు సమాచారం. దీంతో పాటు కోవిడ్ నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలని మంత్రి కేటీఆర్ అధికారులను కోరారు.
కరోనా తీవ్రత ఉన్నందున శాఖ పరిధిలో ఉన్న ఎంటమాలజిస్టులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, మున్సిపల్ శాఖలో ఉన్న ఉద్యోగులు అందరు విధులకు హాజరు కావాలని, సెలవులు రద్దు చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 17, 2021
మున్సిపల్ శాఖ సిబ్బంది కరోనాపై పోరులో ముందువరుసలో ఉన్నందున శాఖ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ చేయించాలని మంత్రి ఉన్నతాధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు రేపటికల్లా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి అవుతుందని, మిగతా పురపాలికల్లో కూడా ఇంకో రెండు లేదా మూడు రోజుల్లో ఉద్యోగులు అందరికీ వ్యాక్సినేషన్ చేయిస్తామని అధికారులు మంత్రి ఆదేశించారు.