Telangana: తెలంగాణలో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్.. గ్రామాల్లో కూడా..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా టీ ఫైబర్ నెట్‌వర్క్ మాత్రమే ఉపయోగించాలి. దీని ద్వారానే ఇంటర్నెట్ సేవలు పొందాలి. ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా ఇంటర్నెట్ సేవలు పొందటానికి వీల్లేదు. ఈ మేరకు కీలక ఆదేశాలిచ్చారు.

Telangana: తెలంగాణలో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్.. గ్రామాల్లో కూడా..
Internet

Edited By:

Updated on: Aug 04, 2026 | 8:57 PM

రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో టీ-ఫైబర్ పనితీరుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సెప్టెంబర్ 1 నుంచి కేవలం టీ-ఫైబర్ నెట్‌వర్క్ ద్వారానే ఇంటర్నెట్ సేవలను వినియోగించేలా చర్యలు పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా ప్రతి కార్యాలయానికి కనెక్టివిటీ కల్పించాలని అధికారులకు ఆదేశించారు.

ప్రైవేట్ ఇంటర్నెట్ బిల్లులకు చెక్

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం వినియోగిస్తున్న ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలకు సెప్టెంబర్ 1 తర్వాత ఎలాంటి బిల్లులు చెల్లించవద్దని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నెట్‌వర్క్ వినియోగాన్ని పెంచి ఖర్చులను తగ్గించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వ విభాగాలు ఉపయోగిస్తున్న టీ-స్వాన్ నెట్‌వర్క్‌ను వచ్చే నెల రోజుల్లో పూర్తిగా టీ-ఫైబర్‌కు బదిలీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. దీంతో ఒకే నెట్‌వర్క్ ద్వారా ప్రభుత్వ సేవలను మరింత సమర్థంగా నిర్వహించే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాంతానికి కూడా ప్రారంభ దశ నుంచే పూర్తి స్థాయి టీ-ఫైబర్ ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించాలని మంత్రి సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇంటింటికి ఇంటర్నెట్ లక్ష్యానికి వేగం

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఇంటింటికి ఇంటర్నెట్” కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గిస్తూ ప్రతి కుటుంబానికి నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందేలా టీ-ఫైబర్ విస్తరణను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us