Telangana: స్థానిక సంస్థల ఎన్నికలపై మరో ట్విస్ట్.. సోమవారం ఏం జరగనుంది..? సుప్రీంకోర్టుకి బీసీ రిజర్వేషన్‌ అంశం..

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా.. దీనిపై హైకోర్టు ఏం చెబుతుందనే దానిపైనే అందరి చూపు నెలకొంది. అయితే ఇప్పుడు ఇదే అంశం సుప్రీంకోర్టుకు కూడా చేరడంతో.. లోకల్ బాడీ ఎన్నికలపై సస్పెన్స్ మరింతగా పెరిగింది. ఈ అంశంపై న్యాయస్థానాలు ఏం చెబుతాయి..? ఎన్నికలు జరుగుతాయా.? లేదా.? అనే ఉత్కంఠ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది.

Telangana: స్థానిక సంస్థల ఎన్నికలపై మరో ట్విస్ట్.. సోమవారం ఏం జరగనుంది..? సుప్రీంకోర్టుకి బీసీ రిజర్వేషన్‌ అంశం..
Telangana Local Body Elections

Updated on: Oct 04, 2025 | 7:40 PM

తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించి అమలు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని, దీనివల్ల మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించుతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తూ వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం మించకూడదు అని సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుకు ఇది విరుద్ధమని వాదించారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఎల్లుండి విచారించనుంది.

మరో వైపు బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 8వ తేదీన తిరిగి విచారణ జరపనుంది. ఎన్నికల కోసం షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఓ వైపు హైకోర్టులో మరో వైపు సుప్రీంకోర్టుకు ఈ అంశం చేరడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీంతో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ ఇచ్చిన జీవో నంబర్​ 9 విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు ఏం చెప్పబోతున్నాయి? జీవో అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా లేక బ్రేకులు వేస్తాయా అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే హైకోర్టులో కేసు విచారణపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశావహులు ఉత్కంఠతో ఉండగా తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్‍తో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది.

జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, వార్డు మెంబర్‌ స్థానాల్లో 42 శాతం బీసీలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం.. దీన్ని సవాల్‌ చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయించడంపై ఉత్కంఠ నెలకొంది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ చేసిన తీర్మానం గవర్నర్‌ దగ్గరే పెండింగ్‌లో ఉండగా, ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ లోపు ప్రభుత్వమే జీవో ఇవ్వాల్సిన అవసరం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. ఎన్నికలకు పది రోజులు ఆగాలని ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. దీంతో రిజర్వేషన్ల అమలుపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. కోర్టులో కేసు ఉండగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెండు విడుతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మూడు విడుతల్లో సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదల చేసింది. 50 శాతం కోటా క్యాప్ ఎత్తేయడాన్ని సవాల్‌ చేస్తూ న్యాయస్థానాల్లో పిటిషన్‌లు దాఖలు చేయడంతో.. ఈ అంశంపై న్యాయస్థానాలు ఏం చెబుతాయి..? ఎన్నికలు జరుగుతాయా.? లేదా.? అనే ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..