Lawyer Couple Murder Case: న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్య కేసుపై బుధవారం నాడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా కేసు దర్యాప్తు స్థాయి నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. ఏడుగురు నిందితుల వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ వద్ద నమోదు చేసినట్లు పోలీసుల తరఫున ఏజీ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. 32 మంది ప్రత్యక్ష సాక్షుల్లో 26 మంది వాంగ్మూలాలు మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశామని పోలీసులు వివరించారు. నిందితులు లచ్చయ్య, వసంతరావు, అనిల్ మొబైల్ ఫోన్లు సిమ్ కార్డులు ఎఫ్ఎస్ఎల్ కి పంపించామని తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక రావడానికి 4 వారాలు పట్టే అవకాశం ఉందన్నారు. కాగా, మే 17వ తేదీ నాటికి వామన్ రావు, నాగమణి హత్య జరిగి 90 రోజులు కానుందన్న ఏజీ ప్రసాద్.. ఆ తేదీ నాటికి సమగ్ర ఛార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి ఉందన్నారు.
ఇదిలాఉంటే.. పోలీసుల నివేదికలు తమకు ఇచ్చేలా ఆదేశించాలని వామన్ రావు తండ్రి తరఫున న్యాయవాది హైకోర్టును కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. వామన్ రావు తండ్రి అభ్యర్థనను తోసిపుచ్చింది. పోలీసుల నివేదికలపై తాము సంతృప్తి చెందామని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నదే తమ ఉద్దేశ్యమని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. సకాలంలో చార్జిషీట్ దాఖలయ్యేలా చూడటమే తమ ఉద్దేశ్యమన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.
కాగా, ఫిబ్రవరి 17వ తేదీన మంథని కోర్టుకు హాజరై హైదరాబాద్‌కు తిరుగు పయనం అవుతున్న న్యాయవాద దంపతులైన వామన్ రావు, నాగమణిలను దుండగులు కల్వచర్ల సమీపంలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అత్యంత దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులు తెలంగాణలో పెను సంచలనం సృష్టించింది. రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించింది.
RBI: పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. డిపాజిట్ పరిమితిని ఆర్‌బీఐ ఎంత పెంచిందంటే..?