
హెచ్ఐవీపై అవగాహన పెంచడంతో పాటు వ్యాధి ఉన్నా బయటకు వచ్చి పరీక్షలు చేయించుకోని వారిని గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో సుమారు 1.50 లక్షల మంది వరకు హెచ్‌ఐవీ బాధితులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీరిలో దాదాపు 1.30 లక్షల మంది ఇప్పటికే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మరో 20 వేల మందికి చికిత్స అందుతోందా? లేదా? అన్నది స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో మిగిలిన వారిని గుర్తించి వైద్య సేవలకు చేరువ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (TSACS-టీసాక్స్) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
హెచ్‌ఐవీపై అనుమానం ఉన్నప్పటికీ పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లేందుకు కొంతమంది వెనకాడుతుంటారు. ముఖ్యంగా హైరిస్క్ గ్రూపులకు చెందినవారిలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి వారి కోసం టీసాక్స్ QR కోడ్ ఆధారిత HIV రిస్క్ అసెస్‌మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. రైల్వే స్టేషన్లు, బస్‌స్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాలతో పాటు ఆన్‌లైన్ వేదికల్లోనూ ఈ QR కోడ్‌ను అందుబాటులో ఉంచారు. QR కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత ముందుగా రాష్ట్రం, ఆపై జిల్లాను ఎంచుకోవాలి. అనంతరం ఏడు ప్రశ్నలు వరుసగా కనిపిస్తాయి. వాటికి అవును, కాదు అనే సమాధానాలు ఇవ్వాలి. ఈ ప్రక్రియలో పేరు, చిరునామా వంటి వ్యక్తిగత వివరాలను అడగరు. మొబైల్ నంబర్ మాత్రమే అవసరం. ప్రశ్నలకు నిజాయతీగా సమాధానాలు ఇస్తే.. సదరు వ్యక్తికి హెచ్‌ఐవీ రిస్క్ ఉందా? లేదా? అన్న దానిపై ప్రాథమిక అంచనా వస్తుంది.
QR కోడ్ ద్వారా రిస్క్ ఉన్నట్లు తేలినంత మాత్రాన ఆ వ్యక్తికి హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్ధారణ చేయలేం. ఇది కేవలం ప్రాథమిక రిస్క్ అంచనా మాత్రమే. అనుమానం ఉన్నవారు సమీపంలోని యాంటీ రిట్రోవైరల్ థెరపీ (ART) కేంద్రాన్ని సంప్రదించి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. నిర్ధారణ కోసం తదుపరి పరీక్షలు నిర్వహిస్తారు. సమీపంలోని ART కేంద్రాల వివరాలను కూడా ఈ విధానం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
హెచ్‌ఐవీ వ్యాప్తి విషయంలో కొన్ని హైరిస్క్ గ్రూపులు కీలకంగా ఉంటాయి. సెక్స్ వర్కర్లు తదితర వర్గాలతో పాటు యువతలోనూ అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. పరీక్షల విషయంలో సంకోచం, సామాజిక భయం కారణంగా కొంతమంది వైద్య సేవలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. అలాంటి వారిని గుర్తించేందుకు QR కోడ్ విధానం ఉపయోగపడుతుందని టీసాక్స్ భావిస్తోంది. ఇప్పటికే ఆగస్టు 12 నుంచి QR కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకురాగా.. దాదాపు 30 వేల మంది వినియోగించారు. వీరిలో సుమారు 2 వేల మంది ఏడు ప్రశ్నలకు పూర్తిగా సమాధానాలు ఇచ్చినట్లు టీసాక్స్ అధికారులు తెలిపారు.
తెలంగాణలో వచ్చే రెండు నెలల పాటు హెచ్‌ఐవీతో పాటు ఇతర లైంగికంగా సంక్రమించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు టీసాక్స్ విస్తృత కార్యక్రమాలు నిర్వహించనుంది. పరీక్షలు, చికిత్స, వ్యాధి నియంత్రణపై ప్రజలకు మరింత సమాచారం అందించడమే కాకుండా.. అవసరమైన వారికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోనుంది. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ రెండూ ఒకటేనని చాలామంది భావిస్తారు. కానీ వైద్యపరంగా ఈ రెండింటికీ స్పష్టమైన తేడా ఉంది. HIV అనేది మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసే వైరస్. ముఖ్యంగా CD4 కణాలను ప్రభావితం చేస్తూ క్రమంగా రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అయితే శరీరంలో HIV ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తికి AIDS వచ్చినట్లు కాదు. సరైన సమయంలో గుర్తించి యాంటీ రిట్రోవైరల్ చికిత్స (ART) తీసుకుంటే HIVతో ఉన్న వ్యక్తి చాలా సంవత్సరాల పాటు ఆరోగ్యంగా, సాధారణ జీవితం గడపవచ్చు.
AIDS అనేది వైరస్ కాదు. చికిత్స అందకుండా HIV సంక్రమణ ముదిరినప్పుడు ఏర్పడే తీవ్రమైన దశ. ఈ దశలో రోగనిరోధక వ్యవస్థ బాగా బలహీనపడటంతో ఇతర ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు సులభంగా దాడి చేసే ప్రమాదం పెరుగుతుంది. చికిత్స తీసుకోకుండా HIV సంక్రమణ కొనసాగితే సంవత్సరాల తర్వాత AIDS దశకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ దశలో క్షయ (TB), నిమోనియా వంటి ఇన్‌ఫెక్షన్లతో పాటు ఇతర అవకాశవాద ఇన్‌ఫెక్షన్లు తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. అందుకే HIVపై భయం కాదు.. అవగాహనే ముఖ్యం. అనుమానం ఉంటే ఆలస్యం చేయకుండా పరీక్ష చేయించుకోవడం, అవసరమైతే ART చికిత్స ప్రారంభించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.